సిక్కులకు ప్రవిత్ర స్థలమైన కర్తార్‌పుర్ సాహెబ్ గురుద్వారా కట్టడం గోపురాలు కూలిపోయిన విషయంపై పాకిస్థాన్ ప్రభుత్వంతో మాట్లాడినట్లు భారత్ అధికారులు వెల్లడించారు. దీనిపై సిక్కు సమాజం ఆందోళనకు గురవుతున్న విషయాన్ని పాక్‌కు వివరించినట్లు తెలిపారు.
"సిక్కు సమాజం మనోభావాలను అర్థం చేసుకుని కూలిన వాటికి మరమ్మతులు చేయించాలని పాకిస్తాన్‌ను భారత్ కోరింది. చారిత్రాక కట్టడంలోని నూతన నిర్మాణాలకు నష్టం కలిగించే విధంగా లోపాలను అత్యవసరంగా సరిచేయాలని సూచించింది."
-భారత అధికార వర్గాలు
గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు వీసా అవసరం లేకుండా పాక్‌లోని కర్తార్‌పుర్‌లో ఉన్న.. దర్బార్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకునే వీలుగా భారత్- పాక్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. దీనికోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించాయి. నవంబర్ 9న భారత్ వైపు ఉన్న కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.