శ్రీలంకతో సన్నిహిత సంబంధాలున్నాయని పాకిస్థాన్ తరచుగా చెప్పుకుంటోంది. ముఖ్యంగా శ్రీలంకలో పౌరయుద్ధం తర్వాత దీనిని మనం ఎక్కువగా చూడవచ్చు. అయితే ఆ దేశంలో ఫిబ్రవరి 22 నుంచి రెండురోజులపాటు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటించనున్నారు. భారత్‌కు చేటుచేసే ఉద్దేశంతోనే శ్రీలంక పర్యటన ఉండనుందని న్యూస్ డాట్ ఐకే వెల్లడించింది.
జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 46వ సమావేశంలో శ్రీలంకపై సరికొత్త తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశాల సమయంలోనే ఇమ్రాన్ పర్యటన ఉండటం గమనార్హం. అయితే ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు పాకిస్థాన్ మద్దతు తెలపనుంది. ఇందుకు ప్రతిగా భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక నుంచి లాభం పొందనుందని సమాచారం. ప్రత్యేకంగా జమ్ముకశ్మీర్ విషయంలో శ్రీలంక సహాయం కోరనుందని అంచనా. అయితే ఐక్యరాజ్య సమితిలో మద్దతు కోసం భారత్‌ను సైతం శ్రీలంక అభ్యర్థించింది.
పాకిస్థాన్ ఆర్థిక స్థితిగతులపై ఆ దేశంలో ప్రతిపక్షాల నుంచి ఇమ్రాన్ ఖాన్‌పై వ్యతిరేకత మొదలైంది. ప్రతిపక్షాలను దారిమళ్లించడానికి కూడా శ్రీలంక పర్యటన ఖాన్‌కు సహాయపడనుంది. కానీ ఈ పర్యటనతో శ్రీలంక పొందే లాభం ఏమి ఉండకపోవచ్చని మేధావుల అంచనా. పాక్ తన స్వలాభం కోసం మాత్రమే ఈ పర్యటనను వాడుకోనుందని సమాచారం.
ఇదీ చదవండి:అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు- ఐదుగురు మృతి