పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. సెనేట్ స్థానం ఎన్నికలో సొంత పార్టీకే చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో శనివారం విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు.
తమ ప్రభుత్వ విశ్వసనీయతను చాటిచెప్పేందుకే విశ్వాసపరీక్ష నిర్వహణకు సిద్ధమైనట్లు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్ తెలిపారు. తనపై నమ్మకం ఉందా లేదా అని తన పార్టీ సభ్యులను ప్రశ్నిస్తానని, లేదని చెబితే ప్రతిపక్షంలో కూర్చుంటానని ఆయన చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వైదొలిగితే, ప్రజల వద్దకు వెళ్లి దేశం కోసం తాను చేస్తున్న పోరాటంలో వారిని మమేకం చేస్తానన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 స్థానాలుండగా,ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి 157 మంది సభ్యులు ఉన్నారు.