మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కరోనా నియంత్రణకు వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఓ అధ్యయనం తేల్చింది. అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రుల్లో వైరస్ బాధితులపై చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడినట్లు తెలిపింది.
ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రీప్రింట్ సర్వర్ మెడిరాక్సివ్ జర్నల్‌లో ప్రచురించారు.
ఏప్రిల్ 11 వరకు కరోనా బారిన పడిన 368 మంది చికిత్స విధానంపై అధ్యయనం చేశారు పరిశోధకులు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. అయితే వీరిలో మరణాలు రేటు అధికంగా ఉందని వెల్లడించారు.
రాబోయే నెలల్లో ఈ మందుపై జరిగే అధ్యయనాలు మరింత సమాచారాన్ని అందిస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు. ఈ పరిశోధనలో 65 ఏళ్లు దాటిన పురుషులనే పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఫలితాలు మహిళలు, యువకులపై ఒకే విధంగా ఉంటాయని చెప్పలేమని స్పష్టం చేశారు.
అందువల్ల కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించటంలో, ముఖ్యంగా అజిత్రోమైసిన్‌ను కలిపినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.