కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ 13అడుగుల దూరం(4 మీటర్లు) వరకు ప్రయాణించగలదని, 8 అడుగుల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చైనా పరిశోధకులు చేసిన ప్రాథమిక విచారణ ఫలితాలను అమెరికాలోని ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ)’ వెలువరించే ‘ఎమర్జింగ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. బీజింగ్‌లోని అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్‌కు చెందిన బృందం వుహాన్‌లోని హ్యూషెన్‌షన్ ఆసుపత్రిలోని ఐసీయూ, సాధారణ కొవిడ్-19 వార్డుల్లో భూ ఉపరితలం, గాలిలోని నమూనాలను పరీక్షించి చూశారు.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య ఇక్కడ 24 మంది రోగులను ఉంచి పరిశోధన చేశారు. వైరస్ అత్యధిక మోతాదులో వార్డుల్లోని నేలపై పేరుకున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. ఐసీయూలో పనిచేసే వైద్యసిబ్బంది బూట్లు, కంప్యూటర్లు, మౌస్‌లు, పడకలు, తలుపు గడియలపై ఎక్కువ వైరస్ కనిపించినట్లు పేర్కొన్నారు. ఈ బృందం గాలిలోవ్యాప్తి (ఏరోసోల్ ట్రాన్స్‌మిషన్)పైనా అధ్యయనం చేసింది. దగ్గు, తుమ్ముల సమయంలో వెలువడే వైరస్‌తో నిండిన తుంపర్లు రోగికి చుట్టూ కిందివైపు 13 అడుగుల దూరం వరకు కేంద్రీకృతమైనట్లు, కొంత పరిమాణం ఎనిమిది అడుగుల ఎత్తువరకు విస్తరించినట్లు కనుగొన్నారు.