దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బ్రిటీష్ రాయబార కార్యాలయం ఎదుట హాంగ్‌కాంగ్ ప్రజలు ర్యాలీ చేపట్టారు. గత కొన్ని నెలలుగా తాము చేస్తున్న ఆందోళనలకు అంతర్జాతీయ మద్దతు కావాలని కోరారు.
యూకే.. హాంగ్‌కాంగ్‌ను రక్షించు!
చైనా కబందహస్తాల నుంచి తమను రక్షించాలని కోరుతూ హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్యవాదులు బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ జెండాలు పట్టుకుని, 'బ్రిటీష్ రాణిని దేవుడు కాపాడాలి', 'హాంకాంగ్‌ని యూకే రక్షించాలి' అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఒకే దేశంలో రెండు వ్యవస్థలు వద్దంటూ నినాదాలు చేశారు.
అంతర్జాతీయ మద్దతు కావాలి
హాంగ్‌కాంగ్‌లో మానవహక్కుల కార్యకర్తల నిరసన ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. అయినప్పటికీ వారు వెనక్కు తగ్గలేదు. అమెరికా జెండాలు పట్టుకొని... హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టడానికి అంతర్జాతీయ మద్దతు కావాలంటూ ఆందోళన చేశారు.
డ్రాగన్ పడగ నీడలో...
ఒక దేశం-రెండు వ్యవస్థలుగా సాగుతున్న హాంగ్‌కాంగ్‌ను 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది బ్రిటన్. గడువు ముగిసినందున 1997లో తిరిగి చైనాకు అప్పగించింది. ఈ ఒప్పందంలో భాగంగా హాంగ్‌కాంగ్ ప్రజలకు పూర్తి హక్కులను కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు చైనా ప్రకటించింది. అప్పటి నుంచి చైనా ఆధ్వర్యంలో పాక్షిక స్వయంప్రతిపత్తి దేశంగా హాంగ్‌కాంగ్ కొనసాగుతోంది.
హాంగ్‌కాంగ్ నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును స్థానిక ప్రభుత్వం తీసుకువచ్చినపుడు.. దేశమంతా అట్టుడికిపోయింది. హాంగ్‌కాంగ్, చైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమాలు జరిగాయి. చివరకు నేరస్థుల అప్పగింత బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాస్వామ్యవాదులు మాత్రం పూర్తి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు.
ఘర్షణ వాతావరణం
హాంగ్‌కాంగ్‌లో కొనసాగుతున్న నిరసనలు పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: '2,050 సార్లు.. 21 మంది మృతి.. కవ్విస్తున్న పాక్'