ఎయిర్ఇండియాపై హాంకాంగ్ రెండు వారాల పాటు నిషేధం విధించింది. ఎయిర్ఇండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ కావడం వల్ల హాంకాంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నిషేధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 18 నుంచి ఆగస్టు 31 వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది. ఫలితంగా ఆగస్టు 18, 21, 25, 28 తేదీల్లో విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.
నిబంధనలు పాటించలేదని..
వందే భారత్ మిషన్‌లో భాగంగా హాంకాంగ్ నుంచి దిల్లీకి ఎయిర్ఇండియా విమాన సేవలు నిర్వహిస్తుంది. అయితే హాంకాంగ్‌కు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకుని కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.
ఇటీవల ఎయిర్ఇండియా విమానంలో హాంకాంగ్‌కు వచ్చిన 11 మంది ప్రమాణికులకు అక్కడి విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. నిబంధనలు పాటించడంలేదనే కారణంతో ఎయిరిండియాపై నిషేధం విధించారు. విమాన సేవల పునురుద్ధరణపై హాంకాంగ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి.
2 వేల సర్వీసులు..
కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. నిబంధనలు సడలించిన తర్వాత, విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను తరలించేందుకు వందే భారత్ మిషన్ పేరుతో ఎయిర్ బబుల్ ఒప్పందం ద్వారా ఎయిర్ఇండియా అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించింది.
అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 2 వేల విమాన సర్వీసుల ద్వారా లక్షా యాభై వేల మంది ప్రయాణించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. తాజాగా ఈ సేవలను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం తెలిపారు.
ఇదీ చూడండి: అమెరికా నుంచి భారత్‌కు మరో 100 వెంటిలేటర్లు