బంగారంతో చేసిన ఆభరణాలు, బంగారం పూత ఉన్న మొబైల్ ఫోన్లు... ఇలా చాలానే చూసే ఉంటారు. అంతెందుకు దుబాయిలోని బుర్జ్ అల్-అరబ్ హోటల్‌లోని ఎలివేటర్, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఎమిరేట్స్ ప్యాలెస్‌లో సీలింగ్, గోడలకు బంగారం పూత వేశారనీ విన్నాం. లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్‌లో కిటికీలు కూడా బంగారంపూతతో నిర్మించారని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా వియత్నాంలో ప్రయత్నం జరుగుతోంది. వాటన్నింటి కన్నా గొప్ప అనిపించుకోవాలని వియత్నాంలోని ఓ హోటల్ ఓ అడుగు ముందుకేసి హోటల్ మొత్తాన్ని బంగారంతో తాపడం చేయిస్తోంది. అవును నిజం. చాలా రోజులుగా జరుగుతున్న పనులు చివరి దశకొచ్చాయి.
![Hanoi golden lake hotel with gold plated exterior and interior](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7983017_golden-h-2.jpg)
డోల్స్ హనొయ్ గోల్డెన్ లేక్ హోటల్.. 2009లో మొదలైన దీని నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం చెబుతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఐదు నక్షత్రాల హోటల్ మొత్తం బంగారుమయమే.
![Hanoi golden lake hotel with gold plated exterior and interior](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7983017_golden-h-4.jpg)
హోటల్ బయట, లోపల గోడలకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయిస్తున్నారు. హోటల్ లోపల లాబీ, ఎలివేటర్లు, ఫర్నీచర్, సింక్, బాత్‌టబ్ ఇలా ప్రతిదీ బంగారంతోనే ఏర్పాటు చేశారు. ఇందులో ఒక రోజు బస చేయడానికి సుమారు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన దేశంలోని ఖరీదైన హోటల్స్‌లో కన్నా తక్కువే.
![Hanoi golden lake hotel with gold plated exterior and interior](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7983017_golden-h-3.jpg)
అంతేకాదు.. 25 అంతస్తుల ఈ హోటల్‌లో కొన్ని ఫ్లాట్‌లను కొనుగోలు చేయొచ్చు. చదరపు మీటర్ ధర రూ. 4.9 లక్షలుగా నిర్ణయించారు. అయితే కొనుగోలు చేసిన వారు మాత్రం అందులో ఉండటానికి వీల్లేదు. దాన్ని రెంటల్ ఏజెన్సీల ద్వారా అద్దెకివ్వాలి. ఈ హోటల్‌ను హోవా బిన్ గ్రూప్ నిర్మిస్తోంది. హోటల్ మొత్తాన్ని బంగారంతో తాపడం చేయించడం ప్రపంచంలో ఇదే తొలిసారని హోవా బిన్ గ్రూప్ అంటోంది.
ఇదీ చూడండి: తెరవకపోతే.. పన్ను మినహాయింపు ఉండదంతే: ట్రంప్