శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొటాబయ రాజపక్సది మతారా జిల్లాలోని పలతువా గ్రామం. 1949 జూన్ 20న రాజకీయ సంపన్న కుటుంబంలో అయిదో సంతానంగా జన్మించారు. ఆయన తండ్రి డీఏ రాజపక్స 1960లలో విజేయనంద దహనాయకే ప్రభుత్వంలో కీలక నేత. అనంతరం మరికొందరితో కలిసి శ్రీలంక ఫ్రీడం పార్టీ స్థాపించారు. వీరి కుటుంబం అప్పటినుంచి శ్రీలంక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
డెబ్బై ఏళ్ల గొటాబయ రాజపక్స తన సోదరుడు మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఎన్నెన్నో ఆరోపణలు...
ఎల్టీటీఈతో యుద్ధంలో తమిళుల మరణాలు, తమిళ కుటుంబాలు అదృశ్యం కావటం వంటివి గొటాబయపై యుద్ధ నేరాల ఆరోపణలకు తావిచ్చాయి.
ఎల్టీటీఈతో సంగ్రామానికి తెరదించిన యుద్ధవీరుడిగా గొటాబయ రాజపక్సేను కీర్తిస్తారు. కానీ... అదే సమయంలో గొటాబయ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. యుద్ధ సమయంలో సైనికులు చేసిన లైంగిక హింస, చట్టవిరుద్ధ హత్యలను రాజపక్స సోదరులిద్దరూ చూసిచూడనట్లు వదిలేశారన్న విమర్శలున్నాయి.
ఎల్టీటీఈని సమూలంగా మట్టికరిపించాలని ప్రయత్నించిన గొటాబయ పేరు... ఆ సంస్థ హిట్ లిస్ట్‌లో తొలి స్థానంలో ఉండేది. గొటాబయను హత్యచేయడానికి 2006 డిసెంబర్లో ఆత్మాహుతి దాడికి యత్నించగా ఆయన తప్పించుకోగలిగారు.
చైనాకే అనుకూలం!
చైనాకు సానుకూలంగా వ్యవహరించే వ్యక్తిగా గొటాబయకు పేరుంది. సోదరుడు మహీంద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ శ్రీలంకలో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది చైనా. ఆ సమయంలో హంబన్‌తోట ఓడరేవు నిర్మాణానికి చైనా పెట్టిన పెట్టుబడులను తిరిగి చెల్లించలేకపోయింది శ్రీలంక. ఫలితంగా 2017లో హంబన్‌తోట రేవును 99 ఏళ్లపాటు చైనాకు లీజుగా అప్పగించుకోవాల్సి వచ్చింది. మహీంద చైనాతో వ్యవహరించిన తీరు కారణంగానే శ్రీలంక ఆ దేశం చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది కొందరి విశ్లేషణ.
పౌరసత్వం రగడ..
గొటాబయకు అమెరికా పౌరసత్వం ఉందని అధికార పక్షమైన యునైటెడ్ నేషనల్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరోపించింది. గొటాబయ పదేళ్ల పాటు అమెరికాలో నివసించారని, ద్వంద్వ పౌరసత్వాలు కలిగి ఉన్న కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయరాదని ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది.
అయితే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నట్లు స్పష్టం చేశారు గొటాబయ. ఈ వ్యవహారంపై నమోదైన కేసును శ్రీలంక సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల్లో పోటీకి గొటాబయకు మార్గం సుగమం చేసింది.
విద్యాభ్యాసం
కొలొంబోలోని ఆనంద కాలేజీలో ప్రాథమిక, మాధ్యమిక విద్యనభ్యసించారు గొటాబయ రాజపక్స. 1971లో సిలోన్ ఆర్మీలో క్యాడెట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. 1991లో సర్ జాన్ కొటేలవాల డిఫెన్స్ అకాడమీలో డిప్యూటీ కమాండర్‌గా పదోన్నతి పొంది 1992లో పదవీ విరమణ చేశారు. సైన్యానికి ఆయన 20 ఏళ్లు అందించిన సేవలకు గుర్తుగా ముగ్గురు శ్రీలంక ప్రధానుల నుంచి అత్యున్నత గ్యాలంట్రీ అవార్డును పొందారు. విరమణ అనంతరం 1992లో కొలొంబో విశ్వవిద్యాలయం నుంచి ఐటీలో పీజీ డిప్లొమా చేశారు. తర్వాత ఓ కంపెనీలో చేరి 1998లో తన నివాసాన్ని అమెరికాకు మార్చుకున్నారు.
2005లో తన సోదరుడు మహీంద రాజపక్స అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం తిరిగి శ్రీలంకలో అడుగుపెట్టారు. అదే సమయంలో శ్రీలంక నుంచి ద్వంద్వ పౌరసత్వాన్ని పొందారు. ఎన్నికల్లో మహీంద విజయం సాధించిన తర్వాత శ్రీలంక రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఎల్టీటీఈపై ఉక్కుపాదం మోపారు. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న యుద్ధానికి చరమగీతం పాడుతూ 2009 మేలో 'ఎల్టీటీఈ'ని మట్టికరిపించారు. యుద్ధవీరుడిగా ప్రఖ్యాతి గాంచారు. ఇప్పుడు దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: లంక నూతన అధ్యక్షుడిగా గోటబయా రాజపక్స!