హాంకాంగ్‌లో జాతీయ భద్రత చట్టం అమలు చేసిన అనంతరం దాని స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచే దిశగా కొత్త నిబంధనలు అమలు చేస్తోంది చైనా. హంకాంగ్ శాసనమండలి ఎన్నికలు నిలిపివేయడమే కాకుండా... హాంకాంగ్ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. దీనిపై అమెరికా నేతృత్వంలోని ఐదు దేశాలు స్పందించాయి.
హాంకాంగ్ ప్రజల హక్కుల్ని అణగదొక్కడానికి... చైనా చేపట్టిన చర్యలను తక్షణమే ఆపాలని అమెరికా నేతృత్వంలోని ఐదు సభ్యదేశాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. హాంకాంగ్ శాసనసభకు ప్రతినిధులుగా ఎన్నికైన వారిని అనర్హులుగా ప్రకటించడానికి అమలు చేస్తున్న కొత్త నిబంధనలపై తీవ్ర ఆందోళ వ్యక్తం చేశాయి. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న అన్ని దేశాల గళాలను నొక్కివేసేలా చైనా వైఖరి ఉందని ఆరోపించాయి.
చైనా తక్షణమే వాటిని నిలిపివేయాలని అమెరికాతో పాటు ఆ బృందంలో ఉన్న ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్తంగా ప్రకటించారు. హాంకాంగ్ శాసనసభ్యులకు వ్యతిరేకంగా చైనా తీసుకున్న చర్యలను తిరిగి పరిశీలించి, వెంటనే శాసనమండలి సభ్యులను తిరిగి నియమించాలని చైనాను కోరారు.
"హాంకాంగ్ స్థిరత్వం, శ్రేయస్సు కోసం వ్యక్తీకరించే ప్రజల అభిప్రాయాలను గౌరవించడం అవసరం. ప్రపంచదేశాల్లో గొప్ప దేశంగా ఎదుగుతున్న చైనా.. అంతర్జాతీయ కట్టుబాట్లను, హాంకాంగ్ ప్రజల హక్కులను గౌరవిస్తుందని భావిస్తున్నాం. ఎన్నికైన హాంకాంగ్ శాసనసభ్యులకు వ్యతిరేకంగా చైనా తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించి, తక్షణమే శాసన మండలి సభ్యులను నియమించాలని' ప్రకటనలో పేర్కొన్నాయి.
చైనా చర్యలను ఖండిస్తూ అమెరికా తీర్మానం
హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కులు, ప్రజల స్వేచ్ఛను అణగదొక్కడాన్ని ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంలో చైనా ప్రభుత్వ చర్యలను ఖండించింది. హాంకాంగ్ ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను ఉల్లంఘిచేలా ఉన్నాయని.. స్వయంప్రతిపత్తిని బలహీనపరుస్తాయని ఈ తీర్మానంలో ఆరోపించింది.
ఇదీ చూడండి: ఒబామా పుస్తకానికి రికార్డ్ స్థాయి కొనుగోళ్లు