బంగ్లాదేశ్‌లోని ఢాకాలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ కరడుగట్టిన ఇస్లాం గ్రూప్‌నకు చెందిన వారు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వారిని నియంత్రించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు.
హథజారి ప్రాంతంలో హిఫాజత్-ఇ-ఇస్లాం సంస్థకు చెందిన వారు హింసకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. కాల్పుల్లో మరణించిన నలుగురి మృతదేహాలను చిట్టగాంగ్ వైద్య కళాశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురూ బుల్లెట్ల గాయాల వల్లే మరణించారని ఇందులో ముగ్గురు మదర్సా విద్యార్థులు, ఒకరు దర్జీ అని హతజారి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏఎఫ్‌పీ వార్త సంస్థకు తెలిపారు.
ఈ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన మోదీ అక్కడ రెండ్రోజులు పర్యటించనున్నారు.