చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ సోకి తాజాగా 118మంది మృతిచెందారు. ఫలితంగా పొరుగు దేశంలో మృతుల సంఖ్య 2,236కు చేరింది. అయితే వైరస్ కేంద్రబిందువైన వుహాన్ సహా చైనావ్యాప్తంగా ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 75వేల మందికిపైగా వైరస్ సోకింది.
చైనా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 42,056 మంది కరోనా బాధితుల్లో.. తాజాగా 18వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 8వేలకు పైగా బాధితుల పరిస్థితి విషమంగా.. మరో 2వేల మంది బాధితుల ఆరోగ్యం క్లిష్టపరిస్థితిలో ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా...
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 25 దేశాల్లో వందలాది మంది కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాక ఆయా దేశాల్లో కరోనా మృతుల సంఖ్య 11కు పెరిగింది. క్రూయిజ్ షిప్లో ఇద్దరు వ్యక్తులు మరణించడం వల్ల జపాన్ మృతుల సంఖ్య 3కు చేరింది. మరోవైపు దక్షిణ కొరియాలో కరోనా వల్ల తొలిసారి ఓ వ్యక్తి మరణించగా.. మరో 52 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కిమ్ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 104కు చేరింది. ఈ వైరస్ కారణంగా ఇరాన్‌తో పాటు హాంకాంగ్‌లోనూ ఇద్దరు మృతిచెందారు. హాంకాంగ్‌లో మరో 68 కేసులను గుర్తించారు అధికారులు. మకావ్‌లో 10 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్, ఫ్రాన్స్, ఫిలిప్పైన్స్, తైవాన్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
వైరస్ బారిన పడ్డ దక్షిణ కొరియా, పాకిస్థాన్, ఇతర దేశాధినేతలతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్లో సంభాషించారు.