చైనా నుంచి ఉపగ్రహ సమాచారాన్ని కొనుగోలు చేసింది పాకిస్థాన్. ఈ సమాచారంలో భాగంగా.. జమ్ము కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ దళాల స్థావరాలను పసిగట్టే సామర్థ్యం ఉన్న హై డెఫినిషన్ వీడియో, ఆప్టికల్ హైపర్స్పెక్ట్రల్ ఇమేజెరీ వ్యవస్థలు ఉన్నాయి.
జిలిన్-1 శాటిలైట్ 2020కి చెందిన డేటాను పొందేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పాక్ నిఘా వర్గాలు తెలిపాయి. 2019లోనూ అధునాతన భూ పరిశీలన ఉపగ్రహ సింథటిక్ అపార్చర్ రాడార్, జిలిన్-1 శాటిలైట్ డేటాను పాక్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. భూసర్వే, ప్రకృతి విపత్తులపై పర్యవేక్షణ, వ్యవసాయ పరిశోధన, పట్టణాల నిర్మాణం వంటి అవసరాలకు ఈ సమాచారాన్ని ఉపయోగించనున్నట్లు చెప్పాయి.
'జిలిన్' అనేది 10 ఉపగ్రహాల సమూదాయం. ప్రపంచవ్యాప్తంగా దీని పరిధి ఉంది. 24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతాన్ని రెండుసార్లు సందర్శించే సామర్థ్యం ఈ శాటిలైట్ సొంతం.
శాటిలైట్ దోస్తీ
ఉపగ్రహ సహకారంలో చైనా, పాక్ మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. 2018లో పాకిస్థాన్ కోసం రెండు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను చైనా ప్రయోగించింది. చైనా, పాకిస్థాన్ ఆర్థిక నడవాపై పర్యవేక్షణ కోసం 'పీఆర్ఎస్ఎస్-1', 'పాక్టీఈఎస్-1ఏ'లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
సరిహద్దులో పాకిస్థాన్తో పాటు చైనా సైతం ఘర్షణలకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి- కరోనా కాలంలో ఓనమ్ వేడుకలు ఇలా...