తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణలో నెలకొన్న జాప్యం, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని భారత విదేశాంగమంత్రి జైశంకర్ చైనాను గట్టిగా హెచ్చరించారు. తజికిస్థాన్ రాజధాని దుషన్‌బేలో జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ వాంగ్ యీతో జైశంకర్ చర్చలు జరిపారు. ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేలా కనిపించాయన్న జైశంకర్.. ఆ తర్వాత నుంచి బలగాలను వెనక్కి రప్పించే ఎలాంటి చర్యలను డ్రాగన్ చేపట్టలేదని గుర్తుచేశారు.
వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న జైశంకర్ తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించిన తర్వాతే భారత్‌తో చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మరోమారు ఆర్మీ ఉన్నాతాధికారుల భేటీని నిర్వహించాలని ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అంగీకరానికి వచ్చారు.
తదుపరి జరగబోయే సైన్యాధికారుల చర్చల్లో ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి : 'గల్వాన్‌లో మరోసారి భారత్-చైనా సైనికుల ఘర్షణ!'