కరోనా వైరస్ మహమ్మారికి పేదవాడు, ధనవంతుడు అనే తేడా లేదు. ఎవరిని ఎప్పుడు కాటేస్తుందో తెలియక అందరూ భయంతో ఆందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వైరస్ నుంచి రక్షణ కల్పించడానికి అక్కడి యంత్రాంగం ఒక క్రిమినాశక టన్నెల్‌ను ఏర్పాటు చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది. అధ్యక్షుడిని కలవడానికి ఎవరు వచ్చినా దాన్నుంచే లోపలకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. దేశ రాజధాని మాస్కోకు కొద్ది దూరంలో ఉన్న అధికారిక నివాసం నోవో-ఒగారియోవోకు సందర్శకులు వస్తుంటారు. దాంతో పుతిన్‌ను కలవాలనుకునేవారు ఈ టన్నెల్ ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
కాగా, ఏప్రిల్‌లో పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ..ఆయన్ను కలవడానికి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కానీ, తర్వాత కొద్ది రోజులకే తాను కూడా వైరస్ బారిన పడినట్లు దిమిత్రి వెల్లడించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సుమారు 5,00,000 కరోనా వైరస్ కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7,284 మరణాలు సంభవించాయి.
ఇదీ చూడండి: ఆరు దశాబ్దాల నాటి ప్లాన్‌తోనే భారత్‌పై చైనా గురి!