కరోనా వైరస్ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు పరిశోధకులు. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కరోనా లక్షణాలని అందరికీ తెలుసు, అయితే కరోనా సోకినప్పటికీ.. ఈ లక్షణాలేమీ కనిపించని వారిలో జీర్ణ రుగ్మతలైన అతిసారము(విరేచనాలు), ఆకలి లేకపోవడం వంటివి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇవికూడా కరోనా సోకడం వల్లే వస్తాయని 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ'లో ప్రచురితమైన పరిశోధనలో పేర్కొన్నారు. ఈ శాస్త్రవేత్తలందరూ కరోనా కేంద్ర బిందువైన చైనా వుహాన్‌లోని 'కొవిడ్-19 వైద్య చికిత్స నిపుణుల బృందం'లో భాగస్వాములు కావడం గమనార్హం.
అలాగే శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్యకు, జీర్ణ రుగ్మతలతో చేరుతున్న వారి సంఖ్యకు మధ్య చాలా అంతరం ఉందని స్పష్టం చేశారు. దీనికి కారణం విరేచనాలు, ఆకలి లేకపోవడం వంటివి కరోనా లక్షణాలని ప్రజలకు తెలియకపోవడమేనని పరిశోధకులు కనుగొన్నారు.
ఇది మరింత ప్రమాదకరం
హుబే రాష్ట్రంలో మూడు ఆసుపత్రుల పరిధిలోని కరోనా పాజిటివ్ రోగులను అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. ఎపిడెమియోలాజికల్ చరిత్ర, జనాభా డేటా, వైద్య చికిత్స లక్షణాలు, లాబొరేటరీ డేటా, చికిత్స కార్యక్రమాలు, రోగుల వైద్య రికార్డుల నుంచి పొందిన ఫలితాలతో పాటు రోగుల ఆరోగ్యం వంటి అంశాలను మార్చి 5 వరకు విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారిలో 48.5 శాతం రోగులు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
కొందరిలో శ్వాసకోశ, జీర్ణ సంబంధిత లక్షణాలు రెండూ ఉంటే, మరికొందరిలో కేవలం జీర్ణ సంబంధిత రుగ్మతలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. రెండో రకం లక్షణాలు ఉన్నవారు కోలుకోవడం కూడా కష్టంతో కూడుకున్న పని అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫలితాలను పూర్తిగా నిర్ధరించడానికి ఇంకా పెద్ద నమూనా అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.