పుల్వామా ఉగ్రదాడి బాధ్యుడు, కరుడుగట్టిన జైషే ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై నేడు నిర్ణయం వెలువడే అవకాశముంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ భేటీలో అజార్ అంశం చర్చకు వచ్చే అవకాశాలెక్కువ. అనంతరం.. ఒక నిర్ణయం తీసుకోనుంది.
అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. అనేక దేశాలు మద్దతు పలికాయి. కానీ... పాకిస్థాన్ మిత్రదేశం చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తోంది. తాజాగా... అజార్ సమస్యకు సరైన రీతిలో పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించింది చైనా. నేడు ఈ అంశంపై మసూద్ అజార్‌కు వ్యతిరేకంగా చైనా నిలుస్తుందా...? అతనిపై ఆంక్షలకు ఐరాసకు మార్గం సుగమం చేస్తుందా..? అనేది వేచి చూడాలి.
మసూద్ నిషేధంపై అయిదోసారి తీర్మానం
జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధిపతి మసూద్ అజార్‌పై నిషేధం విధించాలని ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది అగ్రరాజ్యం అమెరికా. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ఈ తీర్మానానికి బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. గత పదేళ్లలో అజార్‌పై నిషేధానికి ఐరాసలో ప్రతిపాదన ఐదోసారి కావడం గమనార్హం.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఆస్తులు- ఆయుధాల స్వాధీనం వంటి కీలక ప్రతిపాదనలను ఆంక్షల కమిటీ ముందు ప్రవేశపెట్టాయి. ఫలితంగా... ఒకసారి అజార్‌పై నిషేధం అమలైతే అతడి ఉగ్రకార్యకలాపాలకు ఎలాంటి నిధులందే అవకాశం ఉండదు.
ఎన్నో అభియోగాలు....
2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి, 2016లోనే ఉరీ సైనికస్థావరంపై దాడి.. ఇలా పలు భయానక ఉగ్రవాద కార్యకలాపాలకు మసూదే సూత్రధారి.
ఎప్పటినుంచో మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి.
4 సార్లు నిరాశే....
- భారత్ తొలిసారిగా 2009లో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే విధానపర నిర్ణయం తీసుకుంది.
- మళ్లీ 2016లో ఐరాస- 1267 ఆంక్షల కమిటీ ముందు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి రెండో సారి ప్రతిపాదన తీసుకొచ్చింది.
- 2017లో మూడోసారి అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే నిర్ణయం తీసుకొని, ఐరాసకు కదిలాయి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్.
- 2019 మార్చిలో జైషే మహ్మద్ పుల్వామా దాడికి బాధ్యత వహించిన కారణంగా మరోసారి ప్రతిపాదన ప్రవేశపెట్టాయి పీ-3 దేశాలు.
అయితే ఈ 4 సార్లు అజార్‌పై నిషేధానికి అడ్డుపడింది ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో వీటో అధికారమున్న చైనానే.
ఇదీ చూడండి: రణరంగాన్ని తలపిస్తున్న వెనెజువెలా