శ్రీలంకలో ఈస్టర్ వేడుకల రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 359కి చేరింది. దాడుల్లో గాయపడిన వందల మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. దాడులతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది.
దాడులపై సమాచారం తెలియదు
శ్రీలంక మారణహోమంపై రాజకీయ దుమారం రాజుకుంది. ప్రధాని రణిల విక్రమసింఘేతో రాజకీయ వైరమే పేలుళ్లకు అవకాశం కల్పించిందన్న వార్తలను కొట్టిపారేశారు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.
"దాడులపై మిత్ర దేశ నిఘా వర్గాలు సమాచారం అందించినప్పటికీ భద్రత బలగాలు ఎందుకు చర్యలు చేపట్టలేదనే విషయంపై చర్చ జరుగుతోంది. దేశ ప్రజలకు ఒకటి స్పష్టం చేయాలి. నిఘావర్గాల సమాచారాన్ని చేరవేయాల్సిన సంబంధిత అధికారులు నా వరకు తీసుకురాలేదు. నాకు సమాచారం అంది ఉంటే, తక్షణ చర్యలు చేపట్టేవాళ్లం." - మైత్రిపాల సిరిసేన, శ్రీలంక అధ్యక్షుడు.
ఇదీ చూడండి: ప్రధాని నరేంద్రమోదీతో అక్కీ మాటామంతీ