ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఏడు లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 14 కోట్ల 20 లక్షలు దాటింది. మరో 9,418 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 30 లక్షల 33 వేలకు చేరువైంది.
కొవిడ్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి పలు దేశాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫ్రాన్స్, హాంకాంగ్ దేశాలు.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.
ఆ నాలుగు దేశాల నుంచి వచ్చివారికి క్వారంటైన్..
అర్జెంటీనా, చిలీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. 10 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించింది. అయితే బ్రెజిల్ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయనున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్‌లో తాజాగా 29,344 మందికి వైరస్ సోకింది. మరో 140 మంది చనిపోయారు.
భారత్ విమానాల నిషేధం..
భారత్‌లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులను రద్దు చేసింది. మే 3 వరకు నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించింది.
పాక్‌లో కరోనా ఉగ్రరూపం..
పాకిస్థాన్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. తాజాగా 6000 కేసులు నమోదవగా.. 149 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాదిలో తొలిసారిగా అత్యధిక రోజువారి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇతర దేశాల్లో ఇలా..
- ఆదివారం ఒక్కరోజే.. అమెరికాలో 43,174, బ్రెజిల్లో 42,937, టర్కీలో 55,802 కరోనా కేసులు వెలుగుచూశాయి.
- ఇరాన్లో తాజాగా 21,644 మందికి పాజిటివ్‌గా తేలగా.. 405 మంది మృతి చెందారు.
- కొలంబియాలో కొత్తగా 16,871 కేసులు నమోదయ్యాయి. మరో 397 మంది మరణించారు.
- అర్జెంటీనాలో ఒక్కరోజే 16,267 మంది వైరస్ బారిన పడగా.. 64 మంది చనిపోయారు.
- జర్మనీలో మరో 13,123 మంది కొవిడ్ బారిన పడ్డారు. 65 మంది కరోనాకు బలయ్యారు.
- ఇటలీలో కొత్తగా 12,694 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 251 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 32,404,454 | 581,061 |
బ్రెజిల్ | 13,943,071 | 373,442 |
ఫ్రాన్స్ | 5,289,526 | 100,733 |
రష్యా | 4,702,101 | 105,582 |
టర్కీ | 4,268,447 | 35,926 |
ఇదీ చూడండి: లాహోర్‌లో కిడ్నాపైన 11 మంది పోలీసులు విడుదల