భారత్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడి వైద్యులకు సలహాలు ఇచ్చారు చైనా ఉన్నత వైద్యాధికారులు. వైరస్ వ్యాప్తి అరికట్టడంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ప్రజలకు మాస్కులు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
రెండు నెలలుగా వుహాన్ నగరంలో కరోనా కేసులను పర్యవేక్షిస్తున్న నలుగురు ఉన్నత వైద్య అధికారులు.. బుధవారం తొలిసారి ఆన్లైన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్ వైద్య అధికారులకు సలహాలు అందించారు. ఆసియాలోనే ఎంతో ముఖ్యమైన భారత్, చైనా దేశాలకు.. జనాభా, వైద్య వ్యవస్థ వంటి వాటిలో దగ్గరి పోలికలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవి పాటిస్తే చాలు...
వైరస్ను అరికట్టేందుకు భారత్ తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చైనా అధికారులు వివరించారు. రోగులకు చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఇందులో తమను తాము కాపాడుకునేలా కూడా తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. రోగులకు చాలినన్ని గదులను సిద్ధం చేయాలన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మాస్కులు ధరించడం, కనీస శుభ్రతపై ప్రజలకు వైద్యులు అవగాహన కలిగించాలని వెల్లడించారు.
భారత్లో 29 కేసులు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 3 వేలకుపైగా మరణించారు. 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటివరకు 29 కేసులను గుర్తించారు.