మానవ కణాల్లో ప్రొటీన్ల ఉత్పత్తిని కరోనా వైరస్ అడ్డుకుంటున్న తీరును శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు.. శరీర రోగ నిరోధక వ్యవస్థలో ఒక భాగాన్ని అది నిర్వీర్యం చేస్తున్న వైనాన్నీ ఆవిష్కరించారు. కొవిడ్-19కు కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధన సాయపడుతుందని వారు చెప్పారు.
జర్మనీలోని మ్యూనిక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్ వెలువరించే నాన్ స్ట్రక్చరల్ ప్రొటీన్-1 (ఎన్‌ఎస్‌పీ-1).. మానవ కణాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. స్వీయ పునరుత్పత్తికి, మానవ కణాల్లో వ్యాప్తి కోసం వైరస్ ఉత్పత్తి చేసే ఆయుధమే ఈ ప్రొటీన్. ఇన్‌ఫెక్షన్ సోకగానే.. బాధితుడి కణాల్లో ప్రొటీన్ల ఉత్పత్తిని ఇది అడ్డుకుంటుంది. వైరస్ దాడిని తిప్పికొట్టే రక్షణ యంత్రాంగానికి సంబంధించిన పదార్థాలూ ఇందులో ఉన్నాయి. కణంలో ప్రొటీన్ ఉత్పత్తి వ్యవస్థ అయిన రైబోజోమ్‌కు అతుక్కోవడం ద్వారా వైరస్ ఈ లక్ష్యాన్ని సాధిస్తుంది. రైబోజోమ్‌లో ఎన్‌ఎస్‌పీ-1 అతుక్కునే నిర్దిష్ట ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కొత్త ఔషధాలను రూపొందించొచ్చని జర్మన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తద్వారా కరోనా జోరుకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: దేశంలో సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ