తమ కరోనా వైరస్ టీకా 79శాతం ప్రభావంతంగా పనిచేస్తోందని బుధవారం చైనాకు చెందిన ఔషధ సంస్థ సినోఫార్మ్ వెల్లడించింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఫేజ్-3 ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. పశ్చిమ దేశాలకు పోటీగా టీకా తయారీలో చైనా దూకుడు ప్రదర్శించింది. అక్కడ ప్రస్తుతం ఐదు టీకాలు ఫేజ్-3 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అయితే పోటీ సంస్థలైన ఫైజర్, మోడెర్నాలతో పోల్చుకుంటే ఈ టీకా సమర్థత తక్కువగా ఉండటం గమనార్హం.
‘కొవిడ్-19 కట్టడి విషయంలో మా టీకా సామర్థ్యం 79.34 శాతంగా ఉంది’ అని సినోఫార్మ్ అనుబంధంగా పనిచేస్తోన్న బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. ఈ టీకా అనుమతుల కోసం చైనా ఔషధ నియంత్రణ సంస్థకు సినోఫార్మ్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. తొలిసారిగా బుధవారమే టీకా సామర్థ్యం గురించిన వివరాలను ఆ దేశం అందించింది.
టీకాపై అనుమానాలు!
అయితే, ట్రయల్స్ సమాచారంపై పారదర్శకత లేకపోవడంతో చైనా టీకాపై అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేసింది. తన టీకాపై నమ్మకాన్ని కూడబెట్టుకోవడానికి కమ్యూనిస్ట్ దేశం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, దాని భద్రత గురించి ఆ దేశ అధికారులు ప్రజలకు పదేపదే చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఇదిలా ఉండగా..ఆ దేశ టీకాకు ఇంతవరకు ఔషద సంస్థ అనుమతి ఇవ్వలేదు. అయినా అత్యవసర వినియోగం కింద ఇప్పటికే 10లక్షల మందికి పైగా అందించారు. అలాగే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నెల ప్రారంభంలో సినోఫార్మ్ టీకాకు అనుమతి ఇచ్చింది. దీంతో చైనా టీకాను ఆమోదించిన మొదటి విదేశీ దేశంగా నిలిచింది. అంతేకాకుండా ట్రయల్స్ తాత్కాలిక ఫలితాల్లో 86 శాతం సమర్థంగా పనిచేసిందని తెలపడం గమనార్హం. మరోవైపు ఆసియాకు చెందిన పేద దేశాలకు సరసమైన ధరతో ఈ టీకాను అందిస్తామని బీజింగ్ ఇప్పటికే వాగ్దానమూ చేసింది.
ఇదీ చదవండి : ఆస్ట్రాజెనెకా టీకాకు బ్రిటన్ ఆమోదం