కరోనా వైరస్‌తో ఆయుధాలను తయారు చేయటంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారా? సార్స్ కరోనా వైరస్లు నూతన శకం జీవాయుధాలా? ఇప్పటికే మనుషుల్లో వ్యాధికారక వైరస్‌లోకి దీనిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలచుకోవచ్చా?.. అవుననే అంటోంది. 'ది ఆస్ట్రేలియన్' కథనం. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో రాసినట్లు పేర్కొంది. సార్స్ కరోనా వైరస్‌లను నూతన శకం జన్యు ఆయుధాలుగా డ్రాగన్ అభివర్ణిస్తోన్నట్లు తెలిపింది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్యవ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం పేర్కొంటోంది. కరోనా మహమ్మారి 2019లో విరుచుకుపడినప్పటికీ చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్‌తో ఆయుధాల తయారీ గురించి ఐదేళ్ల క్రితం నుంచే చర్చిస్తూ వచ్చినట్లు తెలిపింది.
దీనికి సంబంధించిన పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభ్యమైనట్లు మరికొన్ని ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. కొవిడ్-19పై స్వీయ దర్యాప్తులో భాగంగా అమెరికా అధికారులకు ఈ పత్రాలు చేజిక్కినట్లు తెలిపాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎన్ఏ) కమాండర్లు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకే నుంచి వెలువడే 'ద సన్' పేర్కొంది. వుహాన్ వైరస్ వెనక రహస్యాలను వెల్లడించేలా త్వరలో ఒక పుస్తకాన్ని వెలువరించనున్నారు.
ఇదీ చూడండి: 'అది చైనా నిర్లక్ష్యానికి నిదర్శనం'
ఆ వాదనకు బలం చేకూరింది
భిన్న రకాల వైరస్‌లను సైనిక అవసరాలకు ఎలా వాడుకోవచ్చనేది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుండటం స్పష్టమని 'ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ' (ఏఎస్పీఐ) కార్యనిర్వాహక సంచాలకుడు పీటర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించారు. సైనిక అవసరాలకు ఉద్దేశించిన రోగకారక అణువు ప్రమాదవశాత్తూ బయటకు విడుదలైందన్న వాదనను బలపరిచేలా ఇది ఉందని చెప్పారు.
"వుహాన్ మార్కెట్ నుంచి వైరస్ బయటకు వచ్చినట్లయితే దానిపై దర్యాప్తు నిమిత్తం ఇతర దేశాల నుంచి వస్తామన్న వారికి చైనా సహకరించి ఉండేది. కానీ వైరస్ మూలాల్లోకి వెళ్లాలన్న ప్రయత్నాన్ని డ్రాగన్ వ్యతిరేకించింది"
-పీటర్ జెన్నింగ్స్, ఏఎస్పీఐ కార్యనిర్వాహక సంచాలకుడు
చైనా ప్రభుత్వ పత్రాలు లీకైనప్పుడు అవి సరైనవో కాదో తేల్చి చెప్పే సైబర్ భద్రత నిపుణుడు రాబర్ట్ పోటర్.. తాజా పత్రం నకిలీది కాదని తేల్చడం గమనార్హమని పీటర్ జెన్నింగ్స్ పేర్కొన్నారు. చైనా పరిశోధకులు ఏం ఆలోచిస్తున్నారనేది ఈ పత్రం చెబుతోందన్నారు. అయితే.. చైనా మాత్రం ఇది తమపై బురదజల్లే ప్రయత్నమని తోసిపుచ్చింది.
ఇదీ చూడండి: చైనా దౌత్యవేత్తలను భయపెట్టిన 'అతడు'!
ఇదీ చూడండి: కరోనా వైరస్ జీవ ఆయుధంగా మారితే!