ప్రపంచ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడనాడాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హైనాన్ ద్వీపంలో జరుగుతున్న 'బోవావో ఫోరం' ఆర్థిక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జిన్‌పింగ్... ఓ దేశం రూపొందించిన నిబంధనలు ఇతర దేశాలపై అమలుచేయొద్దని అన్నారు.
"ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వదిలేయడం అవసరం. కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని, సైద్ధాంతిక ఘర్షణలను వ్యతిరేకించాలి. కొన్ని దేశాల ఏకపక్షవాదాన్ని అవలంబిస్తున్నాయి. ఒకటి లేదా పలు దేశాలు రూపొందించే నిబంధనలు ఇతరులపై అమలు చేయకూడదు. పెద్ద దేశాలు.. పెద్ద దేశాల్లాగే ఉండాలి. వాళ్ల స్థాయికి తగ్గట్లు మరింత బాధ్యతగా నడుచుకోవాలి."
-షీ జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం ఉండకూడదని జిన్‌పింగ్ పేర్కొన్నారు. తైవాన్, హాంకాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై చైనాను అమెరికా పదేపదే ప్రశ్నిస్తున్న వేళ.. పరోక్షంగా ఆ దేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం, అధికారం చెలాయించాలని చూడటాన్ని వ్యతిరేకించాలి. అలాంటి వాటికి మద్దతు ఉండకూడదు. మానవత్వానికి ఉమ్మడి విలువలైన శాంతి, అభివృద్ధి, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి అంశాలను ప్రోత్సహించాలి. ప్రస్తుత ప్రపంచానికి ఆధిపత్యం కాదు.. న్యాయం కావాలి."
-షీ జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
ఈ సదస్సుకు యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సహా పలువురు వ్యాపారవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి'