కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ఇతర దేశాల్లో ఇష్టానుసారంగా నిర్వహిస్తోంది చైనా. అధికారిక అనుమతి లేకుండా తమ దేశానికి చెందిన సంస్థల్లోని ఉద్యోగులపై వీటిని ప్రయోగిస్తోంది. దక్షిణ పసిపిక్ ద్వీపకల్ప దేశం పాపువా న్యూ గినియాలో 'చైనాకు చెందిన రము నికో మేనేజ్మెంట్ (ఎంసీసీ) అనే మైనింగ్ సంస్థ తమ సిబ్బందిలోని 48మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరిపినట్లు' ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. ఆగస్టు 10న వ్యాక్సిన్‌ను ఉద్యోగులపై ప్రయోగించినట్లు ఎంసీసీ లెటర్‌హెడ్ కూడా విడుదల చేసింది.
ఈ విషయంపై పాపువా న్యూ గినియా ఆరోగ్య మంత్రి వోంగ్ తీవ్రంగా స్పందించారు. తమ దేశంలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. 180 మంది చైనా సిబ్బందితో వచ్చిన విమానాన్ని వెనక్కిపంపించినట్లు వెల్లడించారు.
అలా ఎలా చేస్తారు..?
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లకు జాతీయ ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపి ధ్రువీకరించాకే ట్రయల్స్ నిర్వహించాలని, ఇప్పటి వరకు తాము ఒక్క వ్యాక్సిన్‌ను కూడా అధికారికంగా ఆమోదించలేదని జాతీయ స్థాయి అధికారి డేవిడ్ మేనింగ్ చెప్పారు. వ్యాక్సిన్.. కచ్చితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించాల్సి ఉందన్నారు.
ఎంసీసీ సిబ్బందిపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పాపువా న్యూ గినియా ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు 'ది ఆస్ట్రేలియా' పత్రిక కథనం ప్రచురించింది.
చైనా సంస్థ మెటాలర్జికల్ కార్పొరేషన్.. ఎంసీసీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులపై వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించి చైనా రాయబారికి మేనింగ్ లేఖ రాశారు. ఈ విషయంపై ఎంసీసీకి, చైనా రాజధాని బీజింగ్‌లోని మాతృసంస్థ ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు.
పాపువా న్యూ గినియా 9 లక్షల జనాభా ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ఇండోనేసియా, ఆస్ట్రేలియా దీనికి అత్యంత సమీపంలో ఉంటాయి. ఈ రెండు దేశాలే అధికంగా విదేశీ సాయం అందిస్తుంటాయి. పాపువా న్యూ గినియాలో 361 కరోనా కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. అయితే గత నెల నుంచి రాజధాని పోర్ట్ మోర్స్‌బైలో కేసుల సంఖ్య పెరిగింది.