ప్రపంచవ్యాప్తంగా.. కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనకంగా సాగుతున్నాయి. తాజాగా.. తాము అభివృద్ధి చేస్తున్న టీకాను.. 2021 ఆరంభంకల్లా ప్రపంచ దేశాలకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా ఫార్మా సంస్థ సినోవాక్ వెల్లడించింది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ 'కరోనావాక్' టీకాను అందుబాటులో ఉంచనున్నట్టు స్పష్టం చేసింది.
టీకా సురక్షితమైనదేనని తేలిన అనంతరం.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయనున్నట్టు సినోవాక్ సంస్థ సీఈఓ యిన్ వైడాంగ్ వెల్లడించారు.
"తొలుత కేవలం చైనాకు మాత్రమే వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలనుకున్నాం. అందుకు తగ్గట్టు ప్రణాళికలు చేసుకున్నాం. అయితే ఆ తర్వాత వాటిని మార్చుకున్నాం. అమెరికా, ఐరాస సహా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం."
-- యిన్ వైడాంగ్, సినోవాక్ సీఈఓ.
చైనా అభివృద్ధి చేస్తున్న నాలుగు కరోనా టీకాల్లో కరోనావాక్ ఒకటి. ప్రస్తుతం.. బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియాలో 24వేలమందిపై టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ఇదీ చూడండి:- కరోనా టీకా 'హ్యూమన్ ఛాలెంజ్'కు బ్రిటన్ రెడీ