కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో(china coronavirus).. వైరస్ మళ్లీ కలవరం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వైరస్ వ్యాప్తిని నిలువరించామని ప్రకటించిన ఆ దేశంలో.. డెల్టా వేరియంట్(China Covid Delta Variant) ఉద్ధృతితో వివిధ నగరాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు(Covid Restrictions In China) అమలు చేస్తున్నాయి.
దక్షిణ చైనా.. ఫుజియాన్ రాష్ట్రంలోని పుతియాన్ నగరంలో కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు అధికారులు.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ నగరం దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. బస్సు, రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వెళ్లేవారు 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్‌గా తేలిన ధ్రువీకరణ పత్రం చూపించాలని స్పష్టం చేశారు.
పుతియాన్లో శనివారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. ఫుజియాన్ రాష్ట్రంలోని మరో నగరమైన క్వాన్జోవులో ఒక కేసు నమోదైనట్లు పేర్కొంది. షియాన్హు కౌంటీ నుంచి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా.. పుతియాన్లో కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నగరంలో సినిమా హాళ్లు, పేకాట స్థలాలు, జిమ్‌లు, పర్యటక ప్రదేశాలతో పాటు జనం గుమికూడే అన్ని రకాల ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు.. నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించవచ్చని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో పుతియాన్లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్లు చైనా ఎన్‌హెచ్‌సీ తెలిపింది. కాగా.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 95,199 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,636 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
జపాన్ జోరు...
తమ దేశంలో 50 శాతం మందికి కరోనా టీకా రెండు డోసులను అందించినట్లు జపాన్(Japan Vaccination Rate) ప్రభుత్వం తెలిపింది. జపాన్‌లో ఫిబ్రవరి మధ్య నుంచి టీకాలు పంపిణీ చేయడం ప్రారంభించారు. మే నెల నుంచి ప్రతిరోజు 10 లక్షల టీకాలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ చివరి నాటికి తమ దేశంలో 60 శాతం మందికి టీకా రెండు డోసులు వేస్తామని జపాన్ ఆర్థిక మంత్రి, యశుతోషి నిశిమురా తెలిపారు.
నవంబర్ నాటికి పెద్దఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసి.. కరోనా ఆంక్షలను సడలించేందుకు జపాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. టీకా పంపిణీ కారణంగా తీవ్రమైన కరోనా కేసుల కేసుల సంఖ్య తగ్గిందని, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా క్షీణించిందని అక్కడి అధికారులు తెలిపారు.
కాగా.. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరంలో వైరస్ కట్టడి కోసం విధించిన ఎమర్జెన్సీని(Tokyo Emergency) ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి అధికారులు గత శుక్రవారం ప్రకటించారు. జపాన్‌లో ఇప్పటివరకు 16.5 లక్షల కేసులు నమోదు కాగా.. 16,700 మంది వైరస్ ధాటికి మరణించారు.
ప్రపంచ దేశాల్లో..
ఇక.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా (Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,53,314 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 7,753 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,50,71,699కి చేరగా.. మరణాల సంఖ్య 46,37,683కు పెరిగింది.
కొత్త కేసులు ఇలా..
- అమెరికా - 72,203
- బ్రెజిల్- 14,314
- రష్యా- 18,891
- బ్రిటన్- 29,547
- ఫ్రాన్స్- 9,601
- టర్కీ- 22,923
- ఇరాన్- 16,654
ఇదీ చూడండి: జూలో 13 గొరిల్లాలకు కరోనా.. వారే కారణం!
ఇదీ చూడండి: బైడెన్ కొత్త ప్లాన్- వైరస్ కట్టడికి కఠిన నిర్ణయాలు