కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్‌లో ఈ మహమ్మారిని ఎదుర్కొన్న తీరును అక్కడి ప్రధాన ఆసుపత్రి అధిపతి వివరించారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడం, స్వల్ప స్థాయిలో ఇన్‌ఫెక్షన్ లక్షణాలున్న వారిని కూడా ఇళ్లల్లో కాకుండా ప్రత్యేక కేంద్రాల్లో ఉంచడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న న్యూయార్క్ వంటి నగరాల్లో ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఉందని వుహాన్ లైషెన్‌షాన్ ఆసుపత్రి అధిపతి వాంగ్ షింగ్వాన్ పేర్కొన్నారు.
మాస్కులు ధరించకపోవడం వల్ల వుహాన్ విశ్వవిద్యాలయానికి చెందిన జాంగ్‌నాన్ ఆసుపత్రిలో కొవిడ్-19 వార్డుల వెలుపలి విభాగాల వైద్య సిబ్బందికి వైరస్ సోకిందని చెప్పారు. 'మాస్కులు లేకుండా రోగులకు దగ్గరగా వెళ్లిన అందరికీ ఇన్‌ఫెక్షన్ సోకింది. దీన్నిబట్టి మాస్కుల సమర్థత గురించి మాకు అవగాహన ఏర్పడింది' అని వాంగ్ పేర్కొన్నారు.
మహమ్మారి వెలుగు చూసిన తొలినాళ్లలో ఒక్కో రోగి.. తన కుటుంబంలో దాదాపు ఆరుగురికి ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేసినట్లు చెప్పారు. అది తమకు చాలా చేదు గుణపాఠమని పేర్కొన్నారు. ‘సమస్యను గుర్తించాక వుహాన్‌లో వ్యాయామశాలలు, ప్రదర్శనశాలలను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చాం. స్వల్ప స్థాయిలో వ్యాధి లక్షణాలున్న వారిని విడిగా ఉంచడానికి క్వారంటైన్ కేంద్రాలుగా వీటిని ఉపయోగించాం. తద్వారా వారు మరింత మందికి ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తి చేయకుండా చూశాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఫౌచి ఉద్వాసనకు సమయం ఆసన్నమైందా?