ఆన్లైన్ ఆటలకు చిన్నారులు బానిసలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ తరహా ఆటలపై వారు గడిపే సమయాన్ని కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించింది.
చైనా ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 18 ఏళ్ల లోపు చిన్నారులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి వీల్లేదు. పగటి సమయంలో కూడా ఏకబిగిన 90 నిమిషాలకు మించి ఆడకూడదు. ఆన్లైన్ గేమ్స్‌పై మైనర్లు వెచ్చించాల్సిన సొమ్ము నెలకు 28 డాలర్లకు మించడానికి వీల్లేదు.
16-18 ఏళ్ల వయసువారికి ఈ మొత్తాన్ని నెలకు 56 డాలర్లకు పరిమితం చేసింది ప్రభుత్వం. ఆన్లైన్ గేమ్స్ ఆడేవారంతా వాస్తవ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫోన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు నంబర్‌తో సైనప్ కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఆటలకు చిన్నారులు బానిసలు కాకుండా చూడటానికి ఆటలోని నిబంధనలను మార్చాలని గేమ్ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ మార్కెట్‌గా చైనా ఉంది.
ఇదీ చూడండి: ఇరాక్ నిరసనలు: సైన్యం కాల్పులతో ఉద్రిక్తత