పాకిస్థాన్ తన వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. మరోసారి భారత్‌పై ఆరోపణలు చేశారు ఆ దేశ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ. ఆ దేశంపై మరోమారు దాడులు చేసేందుకు భారత్ ప్రణాళిక చేస్తోందని ఆరోపించారు. నిఘావర్గాల సమాచారం మేరకు ఈ నెల 16 నుంచి 20 తేదీల మధ్య దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముల్తాన్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన ఖురేషీ.. ఈ మేరకు భారత్‌పై ఆరోపణలు చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు.
" భారత్ కొత్త ప్రణాళిక చేస్తోందని మాకు పక్కా సమాచారం ఉంది. ఇది భయంకరమైన పరిస్థితి. వారు కొత్త దాడులకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 16 నుంచి 20 తేదీల మధ్య దాడులకు అవకాశం ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్క ఎఫ్-16 జెట్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అమెరికా తేల్చింది. అది ప్రపంచమంతా తెలుసు. ఫారెన్ పాలసీ మ్యాగజైన్లో ప్రచురించింది."
- మహమూద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కర చర్యకు సమాధానంగా ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది భారత్. కానీ పాక్ దానిని తోసిపుచ్చింది. కేవలం అడవిలోని చెట్లను దెబ్బతీశారని పేర్కొంది.
ఖురేషీ వ్యాఖ్యలను తేలికగా తీసుకుంది పాక్ ప్రతిపక్షం. ఆ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ). తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే భారత్ నుంచి యుద్ధ భయం ఉందంటోందని పేర్కొంది. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే కొత్త దారులు చూస్తోందని ఆరోపించింది.