హాంకాంగ్‌కు రక్షణ ఉత్పత్తులను నిలిపివేస్తామన్న అమెరికా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది చైనా. తాము కూడా అగ్రరాజ్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాంకాంగ్ జాతీయ భద్రత చట్టం చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న హంకాంగ్ జాతీయ భద్రతా చట్టానికి చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది . ఈ వివాదాస్పద చట్టాన్ని నిలిపివేయాలని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య పార్లమెంట్, జీ-7 దేశాల కూటమి చైనాపై ఒత్తిడి తెచ్చాయి. అయినప్పటికీ వినిపించుకోలేదు చైనా.
ఈ నేపథ్యంలో హాంకాంగ్‌కు రక్షణ ఎగుమతులు నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. హాంకాంగ్‌లో రాజకీయ, పౌర హక్కులను స్వస్తి పలుకుతూ నూతన జాతీయ భద్రతా చట్టాన్ని చైనా ఆమోదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. త్వరలో నూతన విధివిధానాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: ఆ దాడి కచ్చితంగా భారత్ పనే: ఇమ్రాన్‌ఖాన్