సరిహద్దులో ఏదో ఒక రకమైన దుందుడుకు చర్యలకు పాల్పడి భారత్ సత్తాను, సంయమనాన్ని పరీక్షించాలనుకుంటున్న చైనా.. అంతకు మించిన ప్రణాళికనూ అమలుపరచాలని పన్నాగాలు పన్నిందా..? కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్‌ను.. అన్ని వైపుల నుంచి ఊపిరాడకుండా చేయాలని చూసిందా? పాకిస్థాన్‌తో పాటు నేపాల్‌నూ రెచ్చగొట్టి.. వాటివైపు నుంచి భారతదేశానికి సమస్యలు తీసుకురావాలని చూసిందా?.. ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ పరిశీలకుల నుంచి ఔననే సమాధానాలు వస్తున్నాయి. ఆర్థికంగా, సైనిక సత్తా పరంగా మనల్ని గుక్క తిప్పుకోనీయకుండా చేయాలనే కుతంత్రం డ్రాగన్ దేశానికి ఉందని స్పష్టమవుతోంది.
ముప్పేట దాడికి...
ఈ మధ్య కాలంలో భారత్ సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా. ఆర్థిక వ్యవస్థ అంత సానుకూలంగా లేని తరుణంలో.. యుద్ధతరహా పరిస్థితులను సృష్టించి అత్యవసర కొనుగోళ్లపై ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితిని మనకు కల్పించాలనేది చైనా వ్యూహంలో ఒక అంశం. బలగాల మోహరింపునకు తమవరకు ఎలాంటి ఇబ్బందుల్లేకపోవడం వల్ల భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ఒకపక్క తాను అతిక్రమణకు పాల్పడుతూ మరోపక్క నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద భారత్‌పైకి నిరంతరం కాల్పులు జరుగుతూ ఉండేలా, ఉగ్రవాదుల చొరబాట్లు ముమ్మరమయ్యేలా పాకిస్థాన్‌కు తగిన సంకేతాలను చైనాయే ఇచ్చిందని వారు అనుమానిస్తున్నారు. నేపాల్‌తో భారత్‌కు ఎప్పటి నుంచో మైత్రి ఉండడం మంచిదయింది గానీ లేనట్లయితే ఆ దేశాన్నీ మనపైకి ఎగదోసి అన్ని వైపులనుంచి ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేదని చెబుతున్నారు. అయితే నేపాల్‌ను తనవైపు లాక్కునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
నిరంతర ఒత్తిడే లక్ష్యం
భారత్‌ను అస్థిరపరచాలనేది చైనా దీర్ఘకాలిక లక్ష్యం. ఈ పరిస్థితుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద బలగాల మోహరింపును మరింత పెంచాలని ఇటీవల ఒక నిపుణుడు కేంద్రానికి సూచించారు. వివాదాస్పద ప్రాంతంలో ఎక్కువ ఖాళీని దృష్టిలో పెట్టుకుని గస్తీని ముమ్మరం చేయాలని చెప్పారు. బలగాల ఉపసంహరణ గురించి చర్చల్లో చైనా ప్రస్తావిస్తున్నా.. ఆయా ప్రాంతాలను ఒకసారి ఖాళీ చేసిన తర్వాత వాటిని మళ్లీ ఆక్రమించుకోకుండా ఉంటుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఈ మేరకు విస్పష్టమైన హామీని రాబట్టడంపైనే ఈ అంశంలో పురోగతి ఆధారపడి ఉంటుంది. లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వరకు చైనావైపు రహదారులు ఉన్నాయి. మన సైన్యం మాత్రం పర్వతమయ ప్రాంతాల మీదుగా కష్టపడి వివిధ ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఎల్‌ఏసీలో మన భూభాగం వైపు ఒక్క అంగుళాన్నీ విడిచిపెట్టకూడదని సైన్యం గట్టిగా అడుగులు వేస్తోంది.
బ్లాక్‌టాప్ పేరు మార్చే ఎత్తుగడ
పాంగాంగ్ సమీప ప్రాంతాలు తమ భూభాగమని దబాయిస్తున్న చైనా ఇప్పుడు 'బ్లాక్ టాప్' ప్రాంతంపై కన్నేసింది. గతంలో టిబెట్, తూర్పు తుర్కెస్థాన్‌ల పేర్లను మార్చిన రీతిలోనే.. ఇప్పుడు బ్లాక్‌టాప్‌ను 'షెన్‌పావో షాన్' ప్రాంతంగా చైనా సైన్యం తొలిసారిగా పేర్కొంటోంది. అగ్ని పర్వతం అని దీనికి అర్థం. ఎవరూ చూడనప్పుడు ఇతర దేశాల భూభాగాల్లోకి చొరబడడం, అక్కడ కొంత భూమిని ఆక్రమించుకోవడం, సైనిక శిబిరాలను నెలకొల్పడం, సరిహద్దులతో పాటు అక్కడి పేర్లను మార్చేయడం, చరిత్ర ప్రకారం చూసినా అది తమకే చెందుతుందని దబాయించడం ద్వారా పొరుగు దేశాలను కవ్వించడం చైనాకు పరిపాటి.
భారతదేశ సరిహద్దులో రకరకాల కుయత్నాలకు పాల్పడుతున్న పొరుగుదేశం ఇప్పుడు బ్లాక్‌టాప్ విషయంలోనూ అదే పాచిక విసిరిందని అధికారిక ప్రకటనలను చూస్తే తెలుస్తోంది. చుషుల్ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడంలో బ్లాక్‌టాప్ అత్యంత కీలకం. ఆ ప్రాంతంలోని పర్వతాలపై భారత సైనిక బలగాలు పట్టు సాధించడం వల్ల చైనా సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవేళ యుద్ధమంటూ జరిగితే అక్కడ తమ స్థావరాలకు రక్షణ ఉండదని డ్రాగన్ కలవరపడుతోంది. అందువల్ల ఎలాగైనా అక్కడ తిరిగి పాగా వేసేలా అన్ని ప్రయత్నాలు చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.