అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత అమెరికా, చైనా మధ్య తొలిసారి ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో వేగంగా మారుతున్న అఫ్గానిస్థాన్ పరిస్థితులపై (Afghan crisis) చర్చించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ హువాంగ్ జూపింగ్, యూఎస్ సైనికాధికారి మైఖేల్ ఛేజ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం.
ముందే చెప్పినా వినలేదు!
"అఫ్గాన్ సంక్షోభం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశమని అలస్కా చర్చల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ లేవనెత్తారు. కానీ దానిని అమెరికా పట్టించుకోలేదు" అని చైనా సైనికాధికారి ఒకరు చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత చైనాతో తొలి అత్యున్నత స్థాయి సమావేశం ఈ ఏడాది మార్చిలో అలస్కాలో జరిగింది. వాంగ్ యీ, చైనా దౌత్యవేత్త యాంగ్ జీచీ.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్తో చర్చల్లో పాల్గొన్నారు.
మూడు నెలల కిందటే..
అఫ్గాన్ అంశంలో ఇరుదేశాలు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవాలని చైనా భావించినట్లు అధికారులు పేర్కొన్నారని మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ తెలిపింది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు తరలిపోతే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారుతుందో చైనా గ్రహించిందని.. మూడు నెలల క్రితమే దాదాపు చైనీయులందరినీ అఫ్గాన్ నుంచి తరలించిందని సైనికాధికారి చెప్పారని తెలిపింది.
ఇదీ చూడండి: మరో 3 రోజులే.. తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తిస్తుందా?