చైనా.. 70 ఏళ్ల వార్షికోత్సవాలకు ముస్తాబయింది. ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టు పార్టీ తన రాజకీయ విజయాలకు గుర్తుగా 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద సైనిక పెరేడ్‌ను నిర్వహించనుంది.
తియానన్మెన్ స్క్వేర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు జిన్‌పింగ్ సమక్షంలో.. ఆ దేశ శక్తి, సామార్థ్యాలను ప్రదర్శించే యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాంచర్లతో సైనిక పరేడ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది.
భారీ ప్రదర్శన...
1949 అక్టోబర్ 1న ఇదే తియానన్మెన్ స్క్వేర్ వేదికగా కేవలం 17 యుద్ధ విమానాలతో నాడు పరేడ్ జరిగింది. కాని ఈసారి పెరేడ్ భారీ స్థాయిలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాంతర అణు క్షిపణులు, సూపర్ సోనిక్ స్పై డ్రోన్‌లతో చైనా అమేయ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ విన్యాసాలు కొనసాగుతాయి.
మావో జెడాంగ్‌కు నివాళి..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు, ఆధునిక చైనా సృష్టికర్త మావో జెడాంగ్ విగ్రహానికి బీజింగ్‌లో నివాళులర్పించారు జిన్‌పింగ్. అనంతరం చైనా ఆర్థికంగా బలంగా పుంజుకోవడానికి జెడాంగ్ చేసిన కృషిని కొనియాడారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాను భయపెట్టాలని...
సాధారణంగా తమ వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపదను చైనా రహస్యంగా ఉంచుతుంది. అయితే ఈసారి వాటిని ప్రదర్శించడానికి మరో కారణం ఉందంటున్నారు పరిశీలకులు. అమెరికాతో సుదీర్ఘంగా వాణిజ్య యుద్ధం సాగుతోన్న నేపథ్యంలో చైనా బల ప్రదర్శన.. అగ్రరాజ్యాన్ని భయపెట్టేందుకేనని వారు భావిస్తున్నారు.
- ఇదీ చూడండి: చైనా వార్షికోత్సవాలు: అబ్బురపరిచే మకావో లైట్షో