భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తన విదేశాంగశాఖ సహాయమంత్రి కాంగ్ జువాన్యుయును పాకిస్థాన్‌కు పంపించింది. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, చర్చల ద్వారా దాయాది దేశాలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని డ్రాగన్ దేశం సూచించింది.
"ఉపఖండంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి చైనా కృషి చేస్తోంది. భారత్-పాక్‌లు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తాయని చైనా నమ్ముతోంది. ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణంలో సుహృద్భావ చర్చలు జరపడానికి చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది."
-లు కాంగ్, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
పాక్‌ను ప్రోత్సహిస్తాం....
భారత్-పాక్‌లతో చైనా సంప్రదింపులు జరుపుతోందని లు కాంగ్ తెలిపారు. తీవ్రవాద నిర్మూలనకు పాక్ కృషిచేస్తోందని చైనా కితాబివ్వడం గమనార్హం.
"వాస్తవానికి, పాకిస్థాన్ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో మేము పాక్‌ను ప్రోత్సహిస్తున్నాం."
-లు కాంగ్, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
చైనా మడతపేచీ
ఉగ్రవాదంపై నీతి వాక్యాలు చెబుతోన్న చైనా, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రయత్నాలకు మాత్రం మోకాలడ్డుతోంది. ఫ్రాన్స్, యూకే, అమెరికా మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదన చేసింది. 'వీటో' అధికారమున్న చైనా అందుకు ససేమిరా అంది.