అమెరికాకు చెందిన 11 మందిపై చైనా అస్పష్టమైన ఆంక్షలను విధించింది. ఈ జాబితాలో రాజకీయ నాయకులతోపాటు ప్రజాస్వామ్యవాద సంస్థల అధిపతులు ఉన్నారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అధికారికంగా ప్రకటించారు.
హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టానికి సంబంధించి వీరంతా వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు లిజియాన్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా ఆంక్షలు విధించిన హాంకాంగ్, చైనా అధికారుల సంఖ్య, ప్రస్తుతం డ్రాగన్ ప్రకటించిన వారి సంఖ్య సమానం కావటం గమనార్హం.
జాబితాలోని చట్ట సభ్యులు..
సెనెటర్లు మార్కో రుబియో, టెడ్ క్రూజ్, జోష్ హావ్లీ, టామ్ కాటన్, చట్ట సభ్యులు క్రిస్ స్మిత్ ఈ 11 మంది జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రుబియో, క్రూజ్, స్మిత్‌పై గత నెలలో ప్రయాణ నిషేధం విధించింది చైనా. వీగర్ ముస్లింలపై అణచివేతకు పాల్పడేందుకు ప్రయత్నించిన చైనా అధికారులపై అమెరికా కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది.
జిమ్మీ లై అరెస్టు..
హాంకాంగ్‌లో చైనా ధిక్కార స్వరాలను అణగదొక్కే ప్రయత్నాలనూ ముమ్మరం చేసింది. చైనాపై వ్యతిరేకతను తగ్గించేందుకు హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను సోమవారం అరెస్టు చేసి ఆయన సంస్థలపై దాడులు చేసింది.
ఇదీ చూడండి: చైనా కక్షసాధింపు- హాంకాంగ్ మీడియా దిగ్గజం అరెస్ట్