జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనపై ఐరాస భద్రతా మండలి ఈ నెల 13న చర్చిస్తుందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై చైనా స్పందించింది. చర్చలతోనే సరైన పరిష్కారం లభిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
"1267 ఆంక్షల కమిటీ నిబంధనలను చైనా పూర్తిగా అంగీకరిస్తుంది. కమిటీ నియమాలను చైనా పాటించింది. బాధ్యతాయుతంగా చర్చల్లో పాల్గొంది. సమస్యకు చర్చలతోనే సరైన పరిష్కారం లభిస్తుంది."
---- లూ కాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
పుల్వామా దాడి తామే చేశామని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత సంస్థ అధినేత మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఐరాస భద్రతా మండలికి ప్రతిపాదించాయి.
పుల్వామా దాడి అనంతరం భారత్-పాక్‌లతో జరిపిన చర్చల్లో భద్రతా సమస్యల గురించి అధికంగా ప్రస్తావించినట్లు లూ కాంగ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించడానికి ఎంతో ప్రయత్నించామని ఆయన వెల్లడించారు.