ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో ఇబ్బంది పడుతోంటే చైనా మాత్రం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా హాంకాంగ్ భద్రతా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది చైనా కమ్యూనిస్టు పార్టీ.
హాంకాంగ్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తూర్పు ఆసియాలో హాంకాంగ్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. చైనాకు ప్రత్యేక పరిపాలన ప్రాంతం (ఎస్ఏఆర్) గా ఉంది.
ప్రత్యేక ప్రతిపత్తితో ఇబ్బందులు...
అయితే తాజా చట్టంతో హాంకాంగ్‌లోని ప్రత్యేక అధికారాలకు గండి పడనుంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేతిలోని కీలుబొమ్మ సర్కారు ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో నగరంలోని వేర్పాటువాద, విధ్వంసక కార్యకలాపాలతో పాటు అన్ని అంశాల్లో విదేశీ జోక్యం, ఉగ్రవాద, వేర్పాటు వాద నిర్ణయాల్ని అణచివేస్తుంది.
అయితే ఇప్పటికే చైనా అధికార జోక్యంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన హాంకాంగ్ వాసులు ప్రస్తుతం ఎలాంటి స్పందిస్తారన్న విషయంపై ఆందోళన నెలకొంది. స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకుల భావన.
హాంకాంగ్‌లో వ్యతిరేకత..
చైనా తాజా ప్రకటనపై హాంకాంగ్‌లోని ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల బృందాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ కొత్త చట్టాన్ని చైనా తీసుకొస్తే హాంకాంగ్ శకం ముగిసినట్లేనని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరించారు.
చైనా తాజా నిర్ణయంతో 5 రోజులుగా హాంకాంగ్ మార్కెట్లు భారీ స్థాయిలో పతనమవుతున్నాయి. శుక్రవారమూ 5.56 శాతం పడిపోయి 1,350 పాయింట్లు నష్టపోయింది.