భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు రెండు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నట్లు వివరించారు.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు చున్యింగ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యపై భారత్- చైనా సైనికాధికారులు జరిపిన చర్చలు సత్ఫలితాలిచ్చాయని తెలిసిన మరునాడే ఈ విషయంపై స్పందించారు చున్యింగ్. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బలగాలను పరిమిత సంఖ్యలో ఉపసంహరించుకునేందుకు రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
జూన్ 6న నాలుగున్నర గంటల పాటు సాగిన మేజర్- జనరల్ స్థాయి చర్చల్లో.. పాంగోంగ్ సహా వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన వేలాది బలగాలను చైనా తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత్ కోరినట్లు అధికారులు తెలిపారు.
గాల్వన్ లోయ సహా పలు ప్రాంతాల్లోని చైనా బలగాలు 1.5 కి.మీ మేర వెనక్కి మళ్లినట్లు సైన్యం అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.