నేపాల్లోని హుమ్ల జిల్లాకు చెందిన భూములను చైనా ఆక్రమించుకుందని ఆ దేశ విపక్ష నేత జీవన్ బహదూర్ షాహి సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ఆక్రమణతో అక్కడి ప్రజలు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. కనీసం ఆహార పదార్థాలను రవాణా చేసే లారీలను కూడా అనుమతించడం లేదని ఆరోపించారు.
జీవన్.. కర్నాలి రాష్ట్రానికి చెందిన నేత. ఆయన సొంత జిల్లా హుమ్ల. చైనా ఆక్రమణను ప్రధాని కేపీ శర్మ ఓలి ఖండించినప్పటికీ.. ఇటీవలే హుమ్లలో పర్యటించిన జీవన్.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దులోని ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. హుమ్ల ప్రజలకు అందించాల్సిన ఆహార పదార్థాలతో కూడిన లారీలకు కూడా చైనా అనుమతినివ్వడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. నేపాల్ భూములను ఆక్రమించుకోవడం సహా సరిహద్దు పిల్లర్ నెం. 12ను దాటి వచ్చి నిర్మాణాలను చేపడుతోంది చైనా."
-- జీవన్ బహదూర్, నేపాల్ విపక్ష నేత.
ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం చేసేందుకు తమ ప్రజలు వెళ్లారని.. కానీ వారిని చైనా అధికారులు అక్కడి నుంచి తరిమికొట్టారని జీవన్ పేర్కొన్నారు. నేపాల్ సరిహద్దును చైనా ఆక్రమించుకుందని చెప్పడానికి సరిపడా ఆధారాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దీనిని ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:- చైనా సరిహద్దును కలుపుతూ నేపాల్ రోడ్డు నిర్మాణం