దక్షిణ చైనాలోని షెన్జెన్ నగరంలో కురుస్తోన్న భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరదల ధాటికి ఇప్పటివరకు 10మంది మృతి చెందారు. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.
ఫుటైన్ జిల్లాలో అంతర్గత పైప్లైన్లో పనిచేస్తున్న ఐదుగురు శ్రామికులు ఒక్కసారిగా పోటెత్తిన వరదల్లో మునిగిపోయి మృతి చెందారు. ఇదే జిల్లాలోని మరో పైపులైన్లో పూడిక తీస్తున్న నలుగురిలో ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయి ఫెంగ్టాంగ్ నదిలో విగతజీవులుగా తేలారు. లూయోహూ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన ఏడుగురిలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఒకరి ఆచూకీ గల్లంతైంది.
200 మంది గజ ఈతగాళ్లు గల్లంతైన వారికోసం వెతుకుతున్నారు. గంటలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ప్రమాద ప్రాంతం టాంగ్లాంగ్ పర్వత ప్రాంతంలో ఉందని ఇక్కడ వరదలు సంభవించే అవకాశం ఎక్కువని అధికారులు వెల్లడించారు.
తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం, అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సమయం అనుకూలించలేదన్నారు.