Olympics torchbearer భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చైనా మరోసారి అంతర్జాతీయంగా చర్చకు లేవనెత్తింది. గల్వాన్ లోయలో భారత్ సైనికులతో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ పీఎల్‌ఏ కర్నల్ క్వీ ఫాబోవాను.. వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలే రన్ నిమిత్తం టార్చ్‌బేరర్‌గా నియమించింది!
గాల్వన్ ఘర్షణ క్రమంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఉభయ సైన్యాలు ఇప్పటివరకూ 14 దఫాలు చర్చలు జరిపాయి. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే డ్రాగన్ ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. బుధవారం వింటర్ ఒలింపిక్స్ రిలే రన్‌లో క్రీడా ప్రముఖులు, కొవిడ్-19 హీరోలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు.. ఇలా మొత్తం 130 మంది పాల్గొన్నారు. పీఎల్‌ఏ అధికారి అయిన కర్నల్ క్వీ కూడా వీరిలో ఒకరు కావడం విశేషం.
Galwan clash to Winter Olympics
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా దేశ సరిహద్దుల పట్ల విద్యార్థుల్లో అవగాహన కలిగిస్తామంటూ ఈ ఏడాది జనవరి 1న చైనా కొత్త సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే భారత్‌తో సరిహద్దు సమస్యకు ప్రాధాన్యమిస్తూ కర్నల్ క్వీను ఆ దేశం టార్చ్‌బేరర్‌గా నియమించిందని విశ్లేషిస్తున్నారు.
సిగ్గుచేటు..
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారిని ఎంపిక చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయాన్ని అగ్రదేశం అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్య సిగ్గుచేటు అంటూ తీవ్రంగా విమర్శించింది.
'2020లో భారత్‌పై దాడి చేసిన, వీగర్లపై మారణహోమానికి పాల్పడుతోన్న సైనిక కమాండర్‌ను బీజింగ్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం సిగ్గుచేటు. వీగర్ల స్వేచ్ఛ కోసం, భారత సార్వభౌమాధికారానికి అమెరికా మద్దతు కొనసాగిస్తుంది' అంటూ ట్విట్టర్లో స్పందించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'గల్వాన్' ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ!