China covid restrictions: దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. ఆ మహమ్మారి నియంత్రణకు అనుసరిస్తున్న వ్యూహాలు, చేపడుతున్న చర్యలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. 2020లో కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో సముద్ర రవాణా సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులకు అత్యంత కఠిన శిక్ష విధించింది ప్రభుత్వం. వీరు మూడు నుంచి నాలుగన్నరేళ్ల వరకు కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. అంతేగాక రూ.92లక్షల జరిమానా కట్టాలని చెప్పింది.
ఈ ముగ్గురిలో ఇద్దరి ఇంటి పేర్లు ఫుతో ప్రారంభవుతాయి. మరొకరి ఇంటి పేరు జాంగ్. ఓ పోర్టు కార్గో కంపెనీని నడిపేవారు. వీళ్ల కంపెనీ నియమించుకున్న వారిలో నలుగురికి 2020 డిసెంబర్ 5న పాజిటివ్‌గా తేలింది. కానీ లక్షణాలు లేవు. ఆ తర్వాత కంపెనీ కార్గో నిర్వహణలో కరోనా నిబంధనలు పాటించనందు వల్ల మొత్తం 83 మందికి వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. అంటువ్యాధి నియంత్రణ నియమావళిని వీరు పాటించనందు వల్లే వైరస్ ఆ ప్రాంతంలో వ్యాప్తి చెందిందని చెప్పింది. అందుకు కఠిన శిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది.
covid patients in metal boxes
ఇనుప పెట్టెల్లో కుక్కి...
వైరస్ కట్టడికి చైనా ప్రస్తుతం అనుసరిస్తున్న ఐసోలేషన్ విధానాలు, కట్టడి చర్యలు ఎంత కఠినంగా ఉన్నాయంటే.. పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనుకునే స్థాయిలో ఉన్నాయి. కొవిడ్ నిర్ధరణ అయినవారిని బానిసలను కుక్కినట్టు ఇనుప బాక్సుల్లో వేసి దూరం నుంచి ఇంత తిండి పడేస్తున్న తీరు ఎవరికైనా కంటతడి పెట్టిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కొన్నిచోట్ల ఐసోలేషన్ కేంద్రాల్లోని ఇబ్బందులను తట్టుకోలేక కొవిడ్ బాధితులు పారిపోతున్న ఘటనలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కేవలం పదుల సంఖ్యలో కేసులు నమోదైతేనే ఏకంగా కోట్ల జనాభా ఉన్న నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న డ్రాగన్ దేశం.. పాజిటివ్ వచ్చినవారి పట్ల అంతకంటే కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకట్రెండు కేసులు నమోదైన ప్రాంతాల్లో కూడా ప్రజలందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు బస్సుల్లో తరలిస్తోంది. ఒకవేళ ఐసోలేషన్ కేంద్రాలు సమీపంలోనే ఉంటే రోడ్లపై క్యూలో తీసుకెళ్తోంది.
వర్ణనాతీతం..
ఇక ఐసోలేషన్ కేంద్రాల్లో కొవిడ్ బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరుసగా వందల బాక్సులను పెట్టిన కేంద్రాల్లో రోగులను ఉంచుతోంది. ఓ కర్ర మంచం, టాయిలెట్ మాత్రమే ఉండే ఆ డబ్బాల్లోనే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులను ఉంచుతోంది. దాదాపు రెండు వారాలు ఆయా బాక్సుల్లోనే గడపాల్సిన దుస్థితి. కరోనా రోగులకు విశాలమైన గది అది కూడా గాలి, వెలుతురు దారాళంగా వచ్చే విధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు చెబుతుంటే చైనా మాత్రం చిన్న గదుల్లో బాధితులను ఉంచుతోంది.
జీరో కొవిడ్ వ్యూహం పేరుతో చైనా అమలు చేస్తున్న ఐసోలేషన్ నిబంధనలు, బాధితులతో వ్యవహరిస్తున్న తీరు.. విస్మయం కలిగిస్తోంది. ప్రపంచ దేశాల్లో సరైన జాగ్రత్తలతో కొవిడ్ రోగులకు
సమీప బంధువులు, సన్నిహితులు అన్నీ అందిస్తుండగా.. చైనాలో ఇంకా దూరం నుంచే భోజనాలు అందించడం గమనార్హం.
ఇది కాకుండా ప్రస్తుతం 2 కోట్ల మందిని వారి ఇళ్లలోనే నిర్బంధించిన చైనా... వారికి కనీసం ఆహారం కూడా సరఫరా చేయలేకపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటకు వెళ్లి ఆహారం తెచ్చుకునేందుకు కూడా అనుమతించటం లేదని బాధితులు వాపోతున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలాగైతే పస్తులతో ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందన్న బాధితుల వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది.
ఇదీ చదవండి: అఫ్గాన్ ఆర్థిక సంక్షోభం- ఆకలి తీర్చుకోవడానికి అవయవాల విక్రయం