ప్రపంచాన్ని శాసించాలని ఎన్నో దశాబ్దాలుగా చైనా తపిస్తోంది. అమేయశక్తిగా ఎదగాలని, అన్ని రంగాల్లో అగ్రరాజ్యం అమెరికాను దీటుగా ఎదుర్కోవాలని ఊవిళ్లూరుతోంది. ఇందుకోసం సైనిక సన్నద్ధతకు సాంకేతికతను జోడించి ఊహకందని రీతిలో 'సూపర్' జవాన్లను తయారు చేయాలని చైనా ప్రయత్నిస్తున్నట్లు ప్రపంచం విస్తుపోయే నిజాలను అమెరికా బయటపెట్టింది. ఇప్పటికే పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సభ్యులపై చైనా మానవ ప్రయోగాలు చేపట్టినట్లు అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ రాట్ క్లిఫ్ అన్నారు. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.
"అమెరికాతో పాటు ప్రపంచదేశాలకు చైనా పలు సవాళ్లు విసురుతోంది. ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగంలో మేటిగా ఎదగడమే చైనా అంతిమ లక్ష్యం. ఆ ఆకాంక్షతో ఎలాంటి దారుణాలకైనా చైనా వెనుకాడదు. ఈ పరిస్థితుల్లో చైనాను అమెరికా నిలువరించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనా ప్రపంచ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు పెను ముప్పుగా మారింది."
- రాట్ క్లిఫ్, అమెరికా నిఘా విభాగం డైరెక్టర్
ఇదీ చూడండి: అరగంటలో అమెరికా చేరుకోగల చైనా బాహుబలి క్షిపణి!
సూపర్ సైనికులు...
ఆధునిక యుద్ధానికి జీవసాంకేతిక విజ్ఞానాన్ని జోడించి సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు గత ఏడాది ఇద్దరు అమెరికా విద్యార్థులు ఓ పరిశోధనాత్మక కథనాన్ని రాశారు. చైనీయులు చేస్తోన్న ఈ పరిశోధన వివరాలను వీరు సీఆర్ఐఎస్పీఆర్ అనే ఆధునిక చికిత్స విధానం ద్వారా కనిపెట్టారు.
"సీఆర్ఐఎస్పీఆర్ అనేది జన్యుపరమైన వ్యాధుల చికిత్స, మొక్కల్లో, మనుషుల్లో విశేషమైన మార్పుల కోసం వినియోగిస్తారు. కానీ పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఇలా ఆరోగ్యకరమైన వ్యక్తుల పనితీరును పెంచడానికి.. జన్యు మార్పులు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే భవిష్యత్ యుద్ధాలలో మానవ సామర్థ్యాలను పెంచడానికి సీఆర్ఐఎస్పీఆర్ విధానం ఎంత వరకు పనిచేస్తుందనేది ప్రస్తుతం ఒక ప్రశ్నే. కానీ చైనా ఇలాంటి పరిశోధనలు తమ సైనికులపై చేస్తున్నట్లు సమాచారం ఉంది."
- అమెరికా పరిశోధకులు
భవిష్యత్తులో బయోటెక్నాలజీ.. యుద్ధ స్థితిగతులనే మార్చే అవకాశం ఉందని చైనా సైనిక శాస్త్రవేత్తలు, వ్యూహకర్తలు బలంగా నమ్ముతున్నారని వారు పేర్కొన్నారు.
ఆధునిక బయోటెక్నాలజీని నానో సాంకేతికతతో ముడిపెడితే అది ఆయుధాలు, పరికరాలు, సైనిక సన్నద్ధత, యుద్ధ రీతులపై విప్లవాత్మక ప్రభావాలు చూపుతాయని 2017లో ఓ ప్రముఖ చైనిస్ జనరల్ చెప్పిన విషయాన్ని వారు తమ కథనంలో పేర్కొన్నారు.
భయపెట్టే విషయం..
జన్యుమార్పులు, జనెటిక్ సాంకేతికతతో ఆటలు ఆడితే అది ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అమెరికాలో చైనా వ్యవహారాల నిపుణుడు, మాజీ నౌకా దళ అధికారి వార్న్ డిక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై చైనా స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ఇప్పటికే కరోనాతో ప్రపంచం పోరాడుతోన్న తరుణంలో చైనా సరికొత్త తలనొప్పులు సృష్టించడం ఆందోళనకరం.
ఇదీ చూడండి: అజేయ 'హైపర్' ఆయుధాలు భారత్‌కు ఉపయోగమేనా?