ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు త్వరితగతిన తమతమ వాటాను చెల్లించాలని కోరింది చైనా. ఈ సందర్భంగా అతిపెద్ద వాటాదారైన అమెరికా సుమారు 2 బిలియన్ డాలర్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని నొక్కి చెప్పింది. మే 14 వరకు ఉన్న అంచనాల ప్రకారం.. సభ్య దేశాలు ఐరాస సాధారణ బడ్జెట్లో 1.63 బిలియన్ డాలర్లు, శాంతి పరిరక్షక బడ్జెట్లో 2.14 బిలియన్ డాలర్ల మేర చెల్లించని నిధులు ఉన్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి కార్యాలయం నివేదికను పేర్కొంటు ఓ ప్రకటన విడుదల చేసింది చైనా.
" చాలా సంవత్సరాల పాటు బకాయిలు ఉన్నాయి. అప్పులు చెల్లించాల్సిన విషయంలో అమెరికానే మొదటి స్థానంలో ఉంది. ఆ దేశం సాధారణ బడ్జెట్‌కు 1.165 బిలియన్ డాలర్లు, శాంతి పరిరక్షక బడ్జెట్‌కు 1.332 బిలియన్ డాలర్లు చెల్లించాలి."
– చైనా
ఐరాసకు చెల్లించాల్సిన నిధుల విషయంలో అమెరికాను చైనా ఎత్తిచూపినప్పటికీ.. అగ్రరాజ్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వాటా తగ్గించిన ట్రంప్..
ఐక్యరాజ్య సమితికి అందే నిధుల్లో అమెరికానే అత్యధికంగా వాటా కలిగి ఉంది. వార్షిక నిర్వహణ వ్యయంలో 22 శాతం (సుమారు 3 బిలియన్ డాలర్లు), శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో 25 శాతం ( ఏడాదికి 6 బిలియన్ డాలర్లు) చెల్లిస్తోంది. అయితే.. అధికారికంగా అగ్రరాజ్యం శాంతిపరరక్షణ బడ్జెట్లో 27.89 శాతం చెల్లించాలి. కానీ 25 శాతానికి తగ్గించాలని 2017లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో ఏడాదికి సుమారు 200 మిలియన్ డాలర్లు తగ్గించింది.
193 దేశాలకు 53 మాత్రమే..
వాటా చెల్లింపుల్లో జాప్యం జరిగితే వివిధ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. మే 11న విడుదల చేసిన నివేదిక ప్రకారం 193 సభ్య దేశాల్లో కేవలం 50 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయి. రెండో అతిపెద్ద వాటా చెల్లింపుదారుగా ఉన్న చైనా కూడా పూర్తిగా నిధులు అందించింది.