ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా జనగణనను ప్రారంభించింది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతీయ జనాభా లెక్కల నమోదును నవంబర్ 1న మొదలుపెట్టింది. ఇందుకోసం లక్షల మంది సిబ్బంది ప్రతి ఇంటి తలుపుతట్టనున్నారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ జనగణనలో దాదాపు 70లక్షల మంది కమ్యూనిటీ వర్కర్లు, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి జనాభా సమాచారాన్ని సేకరించనున్నారు. తొలిసారిగా వీటి సేకరణ కోసం మొబైల్ యాప్‌లను కూడా చైనా ఉపయోగిస్తోంది.
జనాభా పెరుగుదల తీరును అంచనా వేయడం కోసం ప్రతి పది సంవత్సరాలకొకసారి చైనా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే, విపరీతంగా పెరుగుతోన్న జనాభా పెరుగుదలను నియంత్రించడంలో భాగంగా 1970 దశకం చివరలో 'వన్-చైల్డ్' పాలసీని తీసుకొచ్చింది. తద్వారా ఒకే ఒక్క సంతానానికి అనుమతి ఇచ్చింది. దీంతో, కొన్ని సంవత్సరాల తర్వాత వయసు పైబడుతున్న వారి సంఖ్య పెరగడం, యువత శాతం తగ్గడం వల్ల కొన్నేళ్ల క్రితం విధానానికి స్వస్తి పలికింది.
2010 లెక్కల ప్రకారం, చైనా జనాభా 133,97,24,582గా ఉంది. అంతకుముందు లెక్కలతో పోలిస్తే 5.83 శాతం పెరిగింది. ఈసారి 5.99 శాతం పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో చైనా జనాభా 142 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని, దేశంలో ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇవ్వాలని చైనాకు చెందిన ఓ సంస్థ అక్కడి ప్రభుత్వానికి నివేదించింది. ఇలాంటి వాదనల నేపథ్యంలో చైనా జనాభా పెరుగుదల ఏవిధంగా ఉందనే విషయంపై ఆసక్తి నెలకొంది.