వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కొవిడ్-19 సోకిన చిన్నారులు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తెలిపారు. వారిలో లక్షణాలు చాలాకాలం కిందటే తగ్గిపోయిన సందర్భంలోనూ ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. మహమ్మారి వ్యాప్తిలో పిల్లల పాత్ర గురించి కొత్త అంశాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చింది.
దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వ్యాధి లక్షణాల ఆధారంగా చిన్నారుల్లో కొవిడ్-19 కేసులను గుర్తించడం కష్టమవుతోందని వారు తెలిపారు. ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం పాటు వారిలో వైరస్‌కు సంబంధించిన జన్యు పదార్థామైన ఆర్ఎన్ఏ ఉంటోందని పేర్కొన్నారు. కరోనా సోకి దక్షిణ కొరియాలోని 22 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 91 మంది పిల్లలపై వీరు పరిశోధన చేశారు. వీరిలో 22 శాతం మందిలో ఏ దశలోనూ వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ఆ తర్వాత అవి తలెత్తాయి. 58 శాతం మందికి.. పరీక్ష చేసేటప్పటికీ రుగ్మతలు ఉన్నాయి.
ఈ చిన్నారులను సరాసరిన ప్రతి మూడు రోజులకోసారి పరీక్షించి చూశారు. తద్వారా వారి నుంచి కాలానుగుణంగా వెలువడుతున్న వైరస్ స్థాయిని పరిశీలించారు. మూడు రోజుల నుంచి మూడువారాల పాటు వ్యాధి లక్షణాలు కొనసాగినట్లు తేల్చారు. 91 మందిలోనూ సరాసరిన రెండున్నర వారాల పాటు వైరస్ జాడ కొనసాగింది. అయితే వ్యాధి లక్షణాలు లేని వారిలో ఐదో వంతు మందిలో లక్షణాలున్న వారిలో సగం మందిలో మూడో వారంలోనూ వైరస్ ఉనికి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షలు దాటిన కరోనా కేసులు