చైనాలో మీటూ(China MeToo) ఉద్యమాన్ని ముందుండి నడిపించిన జూవో షియావోసువాన్(Zhou Xiaoxuan case) అనే యువతికి అక్కడి న్యాయస్థానంలో చుక్కెదురైంది. లైంగిక ఆరోపణల కేసులో నిందితుడిపై సరైన ఆధారాలు సమర్పించలేకపోయారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఆరోపణలను కొట్టేసింది.
నేపథ్యమిది...!
చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే అక్కడి సెంట్రల్ టెలివిజన్ 'సీసీటీవీ'లో.. 2014లో జూవో షియావోసువాన్(25) ట్రైనీగా చేరారు. అక్కడ చేరిన కొద్దిరోజులకే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఛానల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న ఓ వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు (China MeToo case) పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మీటూ ఉద్యమంలో చేరిన జూవో తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటం ప్రారంభించారు. బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా.. 50వేల యువాన్‌లను నష్టపరిహారం చెల్లించాలని.. జూవో తన దావాలో పేర్కొన్నారు. ఆమె కృషి ఫలించి చివరకు.. ఈ కేసు గతేడాది డిసెంబర్‌లో కోర్టు విచారణకు వచ్చింది.
తొలుత తనపై లైంగిక వేధింపులు జరిగిన తీరును ఆ యువతి సామాజిక మాధ్యమాల్లో వివరించారు. దీనిపై స్పందించిన ఎంతో మంది చైనా మహిళలు.. ఆమెకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా తమకు ఎదురైన వేధింపుల అనుభవాలను వివరించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే ప్రపంచవ్యాప్తంగా జరిగిన.. మీటూ ఉద్యమం వారిలో మరింత స్ఫూర్తిని నింపింది.
అణచివేత...
కానీ షీ జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం వారిపై నియంత్రణను కొనసాగించడం సహా అసమ్మతి గళాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి కేసుల్లో ముందుకొచ్చే వారు సహా వారి మద్దతుదారులను ఆంక్షలతో అణచివేసే ప్రయత్నాన్ని.. చైనా కొనసాగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు తొలి దశ విచారణ పూర్తికాగా ఈ ఏడాది మేలో జరగాల్సిన రెండోదశ విచారణను కోర్టు వాయిదా వేసింది. తుదిదశ విచారణలో భాగంగా.. మంగళవారం బీజింగ్ కోర్టుకు వచ్చిన జూవోను చుట్టుపక్కల.. వారు ఇబ్బంది పెట్టారు. ప్లకార్డులు ప్రదర్శించిన జూవో మద్దతుదారులను పోలీసులు.. చుట్టుముట్టారు. ప్లకార్డును తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారని, లింగవివక్ష చూపుతున్నారని జూవో మద్దతుదారులు ఆరోపించారు. ఐతే జూవో చేస్తున్న పోరాటంతోనైనా ప్రజల్లో చైతన్యం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో జూవో గెలిచినా ఓడినా న్యాయానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిగా నిలిస్తుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, కేసు తీర్పు తర్వాత స్పందించిన జూవో.. తనకు మద్దతుగా ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న అనుభవాలు మర్చిపోలేనివని అన్నారు.
ఇదీ చూడండి:- 'పిల్లల బెడ్రూంలోకి లాక్కెళ్లి, బలవంతంగా ముద్దాడి...'