పాకిస్థాన్లోని బలోచిస్థాన్ రాష్ట్రం(అఫ్గానిస్థాన్ సరిహద్దు)లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. ప్రధాన సరిహద్దు పట్టణం చమన్లోని భద్రతా దళాల కార్యాలయం వెలుపల జరిగిన ఈ ఘటనలో.. నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
అయితే.. ఈ దాడికి ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక పోలీస్ అధికారి జాకౌల్లా దుర్రానీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు వెల్లడించారు.
లెవీస్ ప్రధాన కార్యాలయంలోని పోలీసులే లక్ష్యంగా.. మోటార్ సైకిల్ బాంబును ప్రయోగించారని దుర్రానీ తెలిపారు. ప్రస్తుతం.. దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
చమన్ పట్టణంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు చనిపోయారు.
ఇదీ చదవండి: రోహింగ్యా క్యాంపులో అగ్నిప్రమాదం.. 15మంది మృతి