మయన్మార్లో సైనిక హింసను తీవ్రంగా తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమాయక ప్రజలపై అనవసరంగా కాల్పులకు పాల్పడటం సరికాదని సూచించారు. మయన్మార్ సైన్యం అవలంబిస్తున్న తీరు క్రూరమైనదిగా పేర్కొన్నారు.
"ఇది చాలా క్రూరమైనది. పూర్తిగా దారుణం. ఎంతో మందిని అన్యాయంగా, అనవసరంగా బలిచేశారు. ఓకే రోజు వంద మందికిపైగా చనిపోయినట్లు తెలిసింది. అది చాలా దారుణమైన సంఘటన. "
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
76వ సైనిక దినోత్సవాన మయన్మార్ భద్రతా బలగాలు శనివారం పేట్రేగిపోయాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 114 మంది చనిపోయారు. ఫిబ్రవరి 1న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ స్థాయిలో రక్తపాతం సంభవించడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: మయన్మార్ రక్తసిక్తం- ఒక్కరోజే 114 మంది మృతి